రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి.. రెండు చెంబుల నీళ్లూ ఇవ్వలే: విశ్వేశ్వర రెడ్డి

రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి.. రెండు చెంబుల నీళ్లూ ఇవ్వలే: విశ్వేశ్వర రెడ్డి

సీఎం కేసీఆర్ సాగునీరు కోసం రాష్ట్ర ఖజానా నుంచి రూ. రెండు లక్షల కోట్లు ఖర్చు చేసి రంగారెడ్డి‌‌ – పాలమూరు జిల్లాలకు రెండు చెంబుల నీళ్లు కూడా ఇవ్వలేదని బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో ఛలో లక్ష్మీదేవిపల్లి ఆందోళన కార్యక్రమాన్ని  బీజేపీ ఆగస్టు 5న చేపట్టింది. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి, మహబూబ్​నగర్​ జిల్లాలనుంచి బీజేపీ నేతలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కార్యక్రమంలో బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు భారీ వాహనశ్రేణితో చౌరస్తా నుండి ప్రదర్శనతో బయలుదేరారు.  ఖాళీ కుర్చీలో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని పెట్టి ఊరేగించుకుంటూ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ స్థలం వద్దకు చేరుకున్నారు.  అనంతరం ప్రాజెక్టుపై కేసీఆర్​ అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. 

ఆ పార్టీ సీనియర్​ నేత ఆచారి మాట్లాడుతూ.. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కట్టి ఈ ప్రాంతానికి నీళ్లు తెస్తే రైతులు భూములు అమ్మరని.. సాగునీరు తేకుండా ఉంటే బడా వ్యాపారులకు అమ్మి రియల్​ఎస్టేట్​ వ్యాపారం చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. 

త్వరలో బుద్వేల్​లో ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన భూముల వేలాన్ని బీజేపీ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. నర్సింహా రెడ్డి మాట్లాడుతూ..  9 ఏళ్ళుగా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కడతామంటూ కాలయాపన చేశారంటూ విమర్శించారు. 

రానున్న అసెంబ్లీ ఎన్నికలలోపు  ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని, లేకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్​ తానే కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రగల్భాలు పలికారని.. ఇచ్చిన హామీ నెరవేర్చనందుకు నిరసనగా ఖాళీ కుర్చీపై కేసీఆర్​ పటాన్ని ఉంచినట్లు తెలిపారు.