- మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి
చేవెళ్ల, వెలుగు : దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందినదిగా మార్చేలా.. ప్రపంచం ప్రశంసించాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ ముందుకెళ్తున్నారని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్, కేసారం గ్రామాల్లో మంగళవారం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంక్షేమ ఫలాలు అందరికి చేరాలని తీసుకున్న కార్యక్రమమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని తెలిపారు.
కేంద్రం సంక్షేమ, అభివృద్ధి పథకాలను గ్రామస్థాయిలో తెలియజేస్తున్నట్లు చెప్పారు. దేశం అభివృద్ధి చెందాలంటే మరోసారి మోదీనే ప్రధాని కావాలన్నారు. బుధవారం మధ్యాహ్నం చేవెళ్ల మండలం అల్లవాడ, సాయంత్రం ఆలూరులో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కొనసాగింపు ఉంటుందని తెలిపారు. మాజీ సర్పంచ్ బూస రవీందర్ రెడ్డి, శ్రీరామ్ నగర్ సర్పంచ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.