కొండగట్టు అంజన్న చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభం

కొండగట్టు,వెలుగు:  కొండగట్టు అంజన్న చిన్న జయంతి ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి హనుమాన్​ దీక్షాపరులు పెద్ద సంఖ్యలో రానున్నారు. భక్తుల కోసం చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం, ప్రత్యేక క్యూ లైన్లు, భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఘాట్​రోడ్డుపై నుంచి జేఎన్టీయూ కాలేజీ మీదుగా రాకపోకలు కొనసాగుతాయని ఆఫీసర్లు తెలిపారు. గుట్టకింది నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించినట్లు వివరించారు. మాలవిరమణ కోసం అర్చకులను నియమించినట్లు వివరించారు.

కోనేరు కళకళ.. 

ఏటా హనుమాన్ చిన్న, పెద్ద జయంతుల సందర్భంగా కోనేరు ప్రధాన సమస్యగా మారేది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఎండోమెంట్ ఆఫీసర్లు ఈసారి ప్రత్యేకంగా మిషన్ భగీరథ సిబ్బందిని నియమించి ఉత్సవాలు జరిగే నాలుగు రోజులపాటు కోనేరు నింపేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు అదనంగా షవర్లు ఏర్పాటు చేశారు. 

నాలుగు ట్యాంకులు..

గుట్టపై నాలుగు మిషన్ భగీరథ ట్యాంకులు అందుబాటు ఉన్నాయని ఆఫీసర్లు తెలిపారు. ఐదు లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు ట్యాంకులు, లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకు ఒకటి ఉందన్నారు. గుట్ట కింది ప్రాంతంలో 10 లక్షల లీటర్ల సంపు ఉందని పేర్కొన్నారు. ఉత్సవాలు జరిగే నాలుగు రోజులపాటు కోనేరులో ఐదు లక్షల లీటర్ల నీటిని నింపుతామన్నారు. నిరంతరంగా తాగునీరు అందుబాటులో ఉంటుందన్నారు.

లడ్డులు రెడీ...

భక్తుల కోసం మూడు లక్షల లడ్డూలు సిద్ధంచేసినట్లు ఆఫీసర్లు తెలిపారు. ప్రసాదాల కోసం ఏడు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. వరుస దొంగతనాల కారణంగా నాలుగు బాడీ స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు అమర్చారు. సుమారు ముడు లక్షల మంది భక్తులు గుట్టకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.