- కొండగట్టుకు భద్రాచలం నుంచి పట్టు వస్త్రాల రాక
- గుట్టపైకి పోటెత్తుతున్న మాలధారులు, భక్తులు
- పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
జగిత్యాల/కొండగట్టు, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో అంజన్న పెద్ద జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం నుంచి వచ్చిన స్వామి వారి పట్టు వస్త్రాలను గురువారం ఒగ్గుడోలు, సన్నాయి బృందం, కోలాటలు, పాటలతో శోభాయాత్రగా ఆలయానికి తీసుకొచ్చారు. భద్రాచలం ఈవో రమాదేవి, కొండగట్టు స్పెషల్ ఆఫీసర్ వినోద్ రెడ్డి, ఈవో చంద్రశేఖర్ పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించారు. రాష్ట్రం నలుమూలల నుంచి గుట్టపైకి హనుమాన్ మాలధారులు, భక్తులు పోటెత్తుతున్నారు. మరోవైపు గురువారం ఉచిత బస్సు సర్వీసును ఆలయ ఆఫీసర్లు ప్రారంభించారు. భక్తుల కోసం మూడు లక్షల లడ్డు ప్రసాదాన్ని సిద్ధంగా ఉంచారు. అలాగే 500 మందితో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. జయంతి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు.
అలరించిన ఆటపాటలు
భద్రాచలం నుంచి తెచ్చిన పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించిన అనంతరం ఆలయ ఆవరణ లో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. రుత్విక్ వరణం, పుణ్యహవాచనం, కంకణ దారుణ చేపట్టిన అనంతరం ఉత్సవమూర్తులను అధికారులు, అర్చకులు యాగశాలకు తీసుకువెళ్లారు. యాగశాలలో అగ్ని మదనం ద్వారా హోమ గుండాన్ని వెలిగించి స్థాపితా దేవారాధన, నవగ్రహ స్థాపన, అరుణి మదనము, సర్వ దేవతా ఆహ్వానము, అభిషేకాలు చేపట్టారు. సాయంత్రం విష్ణు సహస్ర పారాయణం, నైవేద్యం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అధికారులు జయంతి వేడుకలు ప్రారంభించారు. ఆంజనేయుడు, సీత రామ లక్ష్మణుల వేషధారణలతో కళాకారులు అలరించారు. ఈ కార్యక్రమం లో ఏఈవో అంజయ్య, సూపరింటెండెంట్ శ్రీనివాస శర్మ, సునీల్, ఉమా మహేశ్వర్, ప్రధాన అర్చకులు జితేంద్ర ప్రసాద్, ఉప ప్రధాన అర్చకుడు చిరంజీవి, స్థానాచార్యులు కపిందర్ తదితరులు పాల్గొన్నారు.