కోటిమొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న

కోటిమొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న

రాముడికి నమ్మినబంటు... హనుమంతుడు. అంతేకాదు పరాక్రమానికి, విశ్వాసానికి ప్రతీక అయిన హనుమంతుడు భక్తుల కొంగుబంగారం కూడా. అందుకనే హనుమాన్ భక్తులు దీక్ష తీసుకుంటారు. దీక్ష విరమించేందుకు చాలామంది మన రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టుకు వెళ్తారు. ఇక్కడికే ఎందుకంటే... ఇక్కడ ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడని చెప్తారు. కొండగట్టు అనే కొండమీద కొలువైన ఈ ఆంజనేయుడిని ‘కొండగట్టు అంజన్న’ అని పిలుస్తారు. ఐదొందల

ఏండ్ల చరిత్ర ఉన్న ఈ గుడి విశేషాలివి...
మల్యాల మండలం ముత్యంపేట గ్రామ శివారులో ఉంది కొండగట్టు ఆంజనేయుడి గుడి. ఈ దేవాలయం వెనుక ఒక  కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే.. ముత్యంపేట గ్రామానికి చెందిన సింగం సంజీవుడు అనే పశువుల కాపరి ఒకరోజు అడవిలో  ఆవుల్ని మేపుతుంటాడు. ఒక ఆవు మందలోంచి తప్పిపోతుంది. ఆ ఆవును వెతుక్కుంటూ కొండగట్టు వరకు వస్తాడు సంజీవుడు. ఎండలో తిరిగి అలిసి ఒక చెట్టు నీడలో నిద్రపోతాడు. అప్పుడు అతనికి కలలో  ఆంజనేయుడు కనిపించి ‘నేను తంబోర పొదలో ఉన్నాను. నాకు గుడి కట్టించు. తప్పిపోయిన నీ ఆవు ఫలానా చోట ఉంది’ అని చెప్పాడట. మెలకువ వచ్చాక సంజీవుడికి అక్కడి పొదల్లో వెలిగిపోతున్న హనుమంతుడి విగ్రహం కనిపించిందట. దాంతో, అతను కొండగట్టులో హనుమంతుడి గుడి కట్టించాడట. 
 

రెండు ముఖాలతో...
ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే... ఇక్కడ హనుమంతుడు ఎక్కడా లేని విధంగా రెండు ముఖాల (నరసింహస్వామి, ఆంజనేయుడు)తో కనిపిస్తాడు. అంతేకాదు ఛాతి మీద సీతారాముల విగ్రహాలు ఉంటాయి.  దగ్గర్లోని సీతమ్మ బావిలోని నీళ్లతో రోజూ స్వామివారికి అభిషేకం చేయడం ఇక్కడి ఆనవాయితీ. గర్భాలయానికి కుడివైపు వెంకటేశ్వర స్వామి,  ఆండాల్​... ఎడమవైపు  శివపంచాయతన ఆలయం ఉంటాయి.  ఈ ఆలయంలో హనుమాన్ జయంతి  ఏడాదిలో రెండుసార్లు (చైత్ర, వైశాఖ మాసాల్లో) జరుగుతుంది. ఈ గుడి ప్రధాన గోపురానికి రెండు వైపులా ఏనుగు బొమ్మలు, గోపురం మీద ఆంజనేయుడి విగ్రహాలు చెక్కి ఉంటాయి.  ఆలయ ప్రాంగణంలోని ధర్మగుండంలో మునిగి, తలానీలాలు సమర్పించాక స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడికి దగ్గర్లో ఉన్న బేతాళ స్వామికి  కోళ్లు, మేకలు కోసి, కల్లు సాక పోసి  మొక్కులు చెల్లిస్తారు భక్తులు. పక్కనే ఉన్న గుహలోని శివలింగాన్ని దర్శించుకుని వెళ్తారు. 
 

40 రోజులు పూజ చేస్తే...
ఈ గుడిలో 40 రోజులు పూజ చేస్తే మానసికంగా ఎదగని వాళ్ల ఆరోగ్యం బాగుపడుతుందని, పిల్లలు లేనివాళ్లకు సంతానం కలుగుతుందని నమ్ముతారు. భక్తులు ఎండాకాలంలో ఆంజనేయ స్వామి దీక్ష (11 రోజులు, 21 రోజులు, 41 రోజులు ఉంటుంది) తీసుకుంటారు.  హనుమాన్ దీక్ష తీసుకున్నవాళ్లు కొండగట్టులో  దీక్ష విరమించి, స్వామిని దర్శించుకుంటారు. స్వామి వారి బొట్టుని ప్రసాదంగా భావిస్తారు.  భక్తుల సౌకర్యం కోసం ఇక్కడ 45 ధర్మశాలలు ఉన్నాయి. 
ఇలా వెళ్లాలి
జగిత్యాల నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది కొండగట్టు అంజన్న గుడి. కరీంనగర్ నుంచి 40 కిలోమీటర్ల జర్నీ. హైదరాబాద్ నుంచి అయితే దాదాపు 248 కిలోమీటర్ల దూరం. 
టైమింగ్స్
ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు గుడి తెరుస్తారు.