- అంజన్న ఆలయానికి 651 ఎకరాల భూములు
- 50 అంజన్న ఆలయానికి 651 ఎకరాల భూములు ఎకరాలకు పైగా కబ్జా అయినట్లు గుర్తింపు
- 80 శాతం సర్వే పూర్తి, హద్దుల ఏర్పాటుపై ఆఫీసర్ల నజర్
- తిరుపతి తరహాలో వ్యవసాయం, ఉద్యానవన పంటలకు వినియోగించే యోచన!
జగిత్యాల, వెలుగు: సర్కారు ఆదేశాల మేరకు ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయ భూములపై ఎండోమెంట్ ఆఫీసర్లు చేపట్టిన సర్వే తుది దశకు చేరుకుంది. ఆలయానికి సంబంధించి 600 ఎకరాలకు పైగా భూములుండగా, హద్దులు ఏర్పాటు చేయకపోవడంతో కబ్జాకు గురవుతున్నాయి. ఏండ్లుగా కబ్జాలకు గురైన భూములను గుర్తించకపోవడం, అక్రమార్కులపై చర్యలు లేకపోవడంతో ఆలయ భూములకు రక్షణ లేకుండా పోయింది. ఈ తరుణంలో ఆలయ భూములను రక్షించడంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఎండోమెంట్ ఆఫీసర్లు సర్వే నిర్వహిస్తున్నారు. మరో నెల రోజుల్లో సర్వే పూర్తి చేసి కబ్జాలను తొలగించి, హద్దులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
651.24 ఎకరాల భూములు..
అంజన్న ఆలయ భూములు 651.24 ఎకరాలు ఉన్నాయి. మల్యాల మండలం ముత్యంపేట్ లో 475 ఎకరాలు, కొడిమ్యాల మండలం నాచుపెల్లి, రాంసాగర్, డబ్బుతిమ్మయ్య పల్లి గ్రామాల్లో 177 ఎకరాల భూములు ఉండగా, ఇందులో 80 ఎకరాలు వ్యవసాయం భూములు కాగా, మిగిలినవి గుట్ట ప్రాంతంలో వ్యవసాయ, ఇతర భూములు ఉన్నాయి. వీటికి హద్దులు ఏర్పాటు చేయకపోవడంతో కబ్జాలకు గురవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ముత్యంపేట్ లోని గుట్ట కింద ప్రాంతంలోని బస్టాండ్ సమీపంలోని స్థలంతో పాటు ఘాట్ రోడ్డు పక్కన భక్తులు పవిత్రంగా భావించే జల బుగ్గ స్థలాలు, సర్వే నంబర్ 562లో 14 గుంటలు, సర్వే నెంబర్ 80లో 46 ఎకరాల్లో చాలా వరకు భూమి కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. 50 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను కబ్జా చేసి అక్రమంగా సాగు చేస్తున్నట్లు గుర్తించారు.
80 శాతం సర్వే పూర్తి..
కోట్లు విలువ చేసే కొండగట్టు అంజన్న ఆలయ భూములు కబ్జాకు గురి కావడంతో దీనిపై సర్కారు ఫోకస్ పెట్టింది. ఎండోమెంట్ ఆఫీసర్లు సర్వే చేయాలని రెవెన్యూ ఆఫీసర్లకు దరఖాస్తు చేయడంతో.. రెండు నెలలుగా సర్వే చేస్తున్నారు. ఈ సర్వే లో 651.24 ఎకరాలకుగాను 588.06 ఎకరాల్లో సర్వే పూర్తి కాగా, 63.18 ఎకరాల్లో సర్వే నడుస్తోంది. సర్వే పూర్తి కాగానే, ఆలయ ఆధికారులు టెండర్ ద్వారా హద్దులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. డీజీపీఎస్ సాయంతో చేసే సర్వే వివరాలు శాటిలైట్ ఆధారంగా నమోదవుతాయని, హద్దులను తొలగించే అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఆఫీసర్లు చెబుతున్నారు.
తిరుపతి తరహాలో వినియోగం..
కొండగట్టు ఆలయ భూములకు హద్దులు ఏర్పాటు చేసి తిరుపతి తరహాలో వ్యవసాయం, ఉద్యానవన పంటలకు వినియోగించేలా సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.తిరుపతి దేవస్థానం భూముల్లో స్వామి వారికి వినియోగించే పూలు, పండ్లతో పాటు అన్న ప్రసాదం కోసం కూరగాయల పండిస్తారు. ఇదే తరహాలో కొండగట్టు అంజన్న స్వామి పూజకు నిత్యం అవసరమయ్యే పూలు, పండ్లు నిత్య అన్నప్రసాదం, లడ్డూ, పులిహోరాలో వినియోగించుకునేందుకు కూరగాయలు, ధాన్యం పండించేందుకు చర్యలు తీసుకుంటే టెండర్ల ద్వారా సేకరించే నాణ్యత లేని సరుకులకు అడ్డుకట్ట పడనుంది. దీంతో పాటు ఆలయంపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు స్థానికులకు ఉపాధి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
త్వరలోనే సర్వే పూర్తి చేస్తాం..
ఆలయ భూములకు సంబంధించిన డిజిటల్ సర్వే తుది దశకు చేరింది. త్వరలోనే సర్వే పూర్తి చేస్తాం. ఆక్రమణకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటాం. కొంతమేర భూమి కబ్జాకు గురైనట్లు మా దృష్టికి వచ్చింది. అందరి సమక్షంలో మరోసారి సర్వే నిర్వహించి సమస్యను పరిష్కరించి, హద్దులు ఏర్పాటు చేస్తాం. రామకృష్ణారావు, ఆలయ ఈవో, కొండగట్టు