కొండగట్టు బస్సు ప్రమాద బాధితుల ఆందోళన 

జగిత్యాల జిల్లా:  సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటన నేపథ్యంలో కొండగట్టు బస్సు ప్రమాద బాధితులు ఆందోళనకు దిగారు. కొడిమ్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. కేసీఆర్ కొడిమ్యాలకు వచ్చి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. బస్సు ప్రమాదంలో రెండు కాళ్లు విరిగి అంగవైకల్యం పాలైన చాలామందికి కనీసం పెన్షన్ కూడా రావడం లేదన్నారు. బస్సు ప్రమాదంలో తల్లితండ్రిని కోల్పోయి అనాథగా మారానని.. ఎమ్మెస్సీ చదివిన తనకు ఆర్టీసీలో ఉద్యోగమిచ్చి ఆదువుకోవాలని ఓ బాధితుడు గోడు వెళ్లబోసుకున్నాడు.

బాధిత కుటుంబాలకు దళిత బంధులో ప్రాధాన్యమివ్వాలని కోరారు. కనీసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలైన ఇవ్వాలని కోరారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 65 మంది మృతిచెంది నాలుగేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఆదుకోలేదని గుర్తు చేశారు. నిరసనకారులకు కొడిమ్యాల బీజేపీ మండల శాఖ మద్దతు తెలిపింది.