కొండగట్టులో హుండీ దొంగ .. రూ.11 వేలు కొట్టేసిన ఉద్యోగి

కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లా కొండగట్టులో హుండీ లెక్కిస్తూ ఆలయ తాత్కిలిక ఉద్యోగి ఒకరు చేతివాటం ప్రదర్శించాడు. కొద్ది రోజుల క్రితం హుండీ లెక్కింపు సందర్భంగా బంగారం మాయమైన ఘటన మరువకముందే మరొకరు చోరీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కొండగట్టులో భక్తులు సమర్పించిన కానుకల హుండీల లెక్కింపును బుధవారం చేపట్టారు. లడ్డూ తయారీ కేంద్రంలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగి రవి ఈ లెక్కింపులో పాల్గొన్నాడు.

డబ్బులు లెక్కపెడుతున్నట్టు నటిస్తూ రూ.11 వేలను మాయం చేసి అండర్​వేర్​ లోపల దాచి పెట్టుకున్నాడు. ఐదు వందలు వచ్చిన ప్రతిసారి లోపల పెట్టుకుంటుండడంతో గమనించిన తోటి ఉద్యోగులు అధికారులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి రవిని తనిఖీ చేయగా 500 రూపాయల నోట్లు 22 , ఒక 10 రూపాయల నోటు బయటపడ్డాయి. దీంతో రవిని పోలీసులకు అప్పజెప్పారు.  

35 రోజులకు రూ.71 లక్షలు

గత 35 రోజుల్లో భక్తులు కానుకలు వేసిన ఏడు హుండీలను బుధవారం లెక్క పెట్టగా రూ.71,73,723 నగదు వచ్చిందని అధికారులు తెలిపారు. 51 గ్రాముల మిశ్రమ వెండి, 3 గ్రాముల మిశ్రమ బంగారం వచ్చిందన్నారు. అసిస్టెంట్​కమిషనర్ చంద్రశేఖర్, ఈవో వెంకటేశ్, ఏఈఓ బుద్ది శ్రీనివాస్ పాల్గొన్నారు.