కొండగట్టు అధికారులు మొద్దునిద్ర వీడటం లేదు. ఆలయ చరిటలోనే మొదటిసారి భారీ చోరీ జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో దొంగలు రెచ్చిపోతున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి 600 ఏండ్ల చరిత్ర ఉంది. ఉత్తర భారత దేశంలోనే గొప్ప మహిమ గల అంజన్న ఆలయం అధికారుల నిర్లక్ష్యం వల్ల అభాసుపాలౌతుంది. వరుస చోరీలతో భక్తులను ఆందోళనకు గురిచేస్తుంది.
ఫిబ్రవరి 23న అలయ చరిత్రలోనే మొదటి సారి దొంగతనం జరుగగా...దొంగలు సుమారు 15 కిలోల వరకు వెండి వస్తువులు దొంగిలించారు. సాక్షాత్తు ఆలయ గర్భ గుడిలోనే చోరీకి పాల్పడ్డారు. ఇద్దరు ఏఎస్ఐలు,12 మంది హోమ్ గార్డ్స్, 10 మంది ప్రైవేట్ ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ ఉన్నా కూడా దొంగతనం అరికట్ట లేకపోయారు. చివరికి పోలీసులు ఎలాగోలా దొంగలను పట్టుకొని కొంత మేర వెండి రికవరీ చేశారు. ఈ సంఘటన మరువక ముందే మళ్లీ సోమవారం పీసీసీ స్టేట్ చీఫ్ రేవంత్ రెడ్డి కొండగట్టు పర్యటనలో జేబు దొంగలు తమ హాల్ చల్ చేశారు. సుమారు 5 గురి పర్సులు దొంగించారు. ఇందులో దాదాపుగా 50,000 వరకు నగదు దొంగతాననికి గురైంది. కానీ నాయకులు బయటకు చెప్పుకోలేక కుమిలిపోయారు. ఇది జరిగిన మరుసటిరోజు మంగళవారం దొంగలు దర్జాగా గుట్టపైకి వచ్చి దేవస్థానం గదుల్లో చోరీకి పాల్పడ్డారు. ఈ సారి దేవుణ్ణి వదిలి భక్తులను టార్గెట్ చేశారు. మూడు గదుల తాళాలు పగులక్గొట్టి 4 వేల నగదుతో పాటు, మూడు సెల్ ఫాన్స్ చోరీ చేశారు. చోరీ అనంతరం దొంగలు దర్జాగా కారులో వెల్లరంటే సెక్యూరిటీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గర్భగుడిలో చోరీ జరిగినప్పుడే ఆలయ భద్రత పైన విమర్శలు వచ్చినా అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆలయ భద్రత, భక్తుల విశ్వాసాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.