
- అలంకారప్రాయంగా కొండపాక మార్కెట్
- ఏఎంసీ ఏర్పాటు కోసం ఎదురుచూపులు
సిద్దిపేట, వెలుగు: గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటై పదేండ్లు కావస్తున్నా ఇప్పటి వరకు పాలక వర్గాన్ని ఏర్పాటు చేయలేదు. 2014 లో కొండపాక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటైంది. అంతకు ముందు తొగుట మార్కెట్ కమిటీ పరిధిలో కొండపాక మండలం కొనసాగేది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొండపాక మండలానికి ప్రత్యేకంగా మార్కెట్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఇందు కోసం కొండపాక గ్రామ సమీపంలోని మూడెకరాల స్థలంలో రూ.4 కోట్లతో కార్యాలయం, గోడౌన్, వే బ్రిడ్జి నిర్మించారు. పది సంవత్సరాలుగా ఏఎంసీ కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో కార్యాలయం అలంకార ప్రాయంగా మారింది. ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోడౌన్ లో ప్రస్తుతం ఈవీఎంలను భద్రపరచగా, నిర్మించిన వే బ్రిడ్జి అలంకార ప్రాయంగా మారింది.
ఏకాభిప్రాయం లేక పెండింగ్
కొండపాక ఏఎంసీ ఏర్పాటైన తర్వాత చైర్మన్ తో పాటు సభ్యుల ఎంపిక కోసం నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఉద్యమ సమయంలో పనిచేసిన వారు, కొత్తగా పార్టీలో చేరిన వారికి మధ్య ఏకాభిప్రాయం కుదరక పాలకవర్గ ఏర్పాటునే పక్కన పెట్టారు. గతంలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఏఎంసీ పాలక వర్గం ఎంపిక కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదు. అలాగే గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉండడంతో కొండపాక ఏఎంసీ పాలక వర్గం గురించి ఆయన దృష్టికి తీసుకువెళ్లడానికి ఎవరూ సాహసించలేదు.
మంత్రి ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు
రాష్ట్రంలోని మార్కెట్ కమిటీ పాలక వర్గాలను ఏర్పాటు చేయడానికి కసరత్తు ప్రారంభిస్తున్నట్టు అగ్రికల్చర్మినిస్టర్ తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించడంతో స్థానికంగా పలువురు నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఎలాగూ ఏఎంసీ కమిటీ ఏర్పాటు చేయలేదు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా పాలక వర్గం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. పాలకవర్గంలో చైర్మన్ తో పాటు 18 మంది సభ్యులుండే అవకాశం ఉండడంతో మండల కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఇప్పటికైనా పాలక వర్గం ఏర్పాటు చేయాలి
కొండపాక ఏఎంసీ పాలక వర్గాన్ని ఇప్పటికైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కోట్ల రూపాయలతో కట్టిన మార్కెట్ కమిటీ భవనం అలంకార ప్రాయంగా మారింది. పాలక వర్గాన్ని ఏర్పాటు చేస్తే రైతులు తమ సమస్యలను విన్నవించుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా కొండపాక ఏఎంసీ కమిటీ ఏర్పాటవుతుందని ఆశిస్తున్నా.
కరడపల్లి మల్లయ్య, రైతు, కొండపాక