కొండాపూర్‌‌ అండర్‌‌ గ్రౌండ్‌‌ మైన్‌‌లో నీళ్లకు...భూ కంపమే కారణమా ?

కొండాపూర్‌‌ అండర్‌‌ గ్రౌండ్‌‌ మైన్‌‌లో నీళ్లకు...భూ కంపమే కారణమా ?
  • ఎనిమిది రోజులుగా నిలిచిన బొగ్గు ఉత్పత్తి
  • నీటిని తోడేందుకు మరో 15 రోజులు పట్టే అవకాశం

భద్రాద్రికొత్తగూడెం/మణుగూరు, వెలుగు : సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని కొండాపూర్‌‌ అండర్​గ్రౌండ్‌‌ మైన్‌‌లో నీటి ఊటకు ఇటీవల వచ్చిన భూ కంపమే కారణమన్న చర్చ నడుస్తోంది. మైన్‌‌లోకి భారీ స్థాయిలో నీరు చేరడంతో ఎనిమిది రోజులుగా ఉత్పత్తి నిలిచిపోయింది. నీటిని తోడేసేందుకు ఇప్పటికే మూడు మోటార్లు ఏర్పాటు చేయగా, అదనపు మోటార్ల ఏర్పాటుకు ఆఫీసర్లు సిద్ధం అవుతున్నారు. 

అదనపు మోటార్ల ఏర్పాటుకు చర్యలు

ఈ నెల 6వ తేదీన నైట్‌‌ షిఫ్ట్‌‌లో పనిచేస్తుండగా ఒక్కసారిగా వాటర్‌‌ రావడంతో కార్మికులు అలర్ట్‌‌ అయ్యారు. మైన్‌‌లో ఉన్న విలువైన మెషనరీని తీసుకొని కార్మికులు బయటకు వచ్చేశారు. భూ గర్భం నుంచి నీటి ఉధృతి ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేది. మైన్‌‌లో ఇప్పటివరకు 90 లక్షల గ్యాలన్ల నీరు ఉన్నట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. దీంతో రెండు 190 హెచ్‌‌పీ, 240 హెచ్‌‌పీ మోటార్లతో నీటిని తోడేస్తున్నారు. నీటి ఊట ఎక్కువగా ఉండడంతో మరో రెండు మోటార్లు ఏర్పాటు చేసేందుకు ఆఫీసర్లు ప్రయత్నం చేస్తున్నారు. 

రూ. 2 కోట్లకు పైగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

కొండాపూర్‌‌ అండర్‌‌ గ్రౌండ్‌‌ మైన్‌‌లో నీళ్లు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఎనిమిది రోజులుగా ఆటంకం ఏర్పడింది. ఈ మైన్‌‌ నుంచి ప్రతి రోజు 500 టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. విలువైన జీ6 గ్రేడ్​బొగ్గు ఈ మైన్‌‌లోనే దొరుకతుంది. ఇప్పుడు మైన్‌‌లోకి నీళ్లు చేరడంతో రూ. 2 కోట్లకు పైగా విలువైన బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. మైన్‌‌లో పూర్తిస్థాయిలో నీటిని తోడేస్తే తప్ప బొగ్గు ఉత్పత్తి చేసేందుకు అవకాశాలు లేవు. మైన్‌‌లో నీటిని తొలగించేందుకు మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.

గుర్తించడంలో ఆఫీసర్లు విఫలం

కొండాపూర్‌‌ అండర్‌‌ గ్రౌండ్‌‌ మైన్‌‌లో నీటి ఊటకు ఇటీవల వచ్చిన భూకంపమే కారణమై ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మైన్‌‌లోకి అప్పుడప్పుడు నీళ్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఇంత పెద్ద మొత్తంలో నీరు వచ్చే అవకాశాలను గుర్తించడంలో ఆఫీసర్లు విఫలం అయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అదనపు మోటార్లు తెస్తున్నాం 

మైన్‌‌లో ఉన్న నీటిని ప్రస్తుతం మూడు మోటార్లతో తోడేస్తున్నాం. అదనంగా మరో ఒకటి, రెండు మోటార్లు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాం. ఇటీవలి కాలంలో వచ్చిన భూ ప్రకంపనల మూలంగానే మైన్‌‌లోకి భారీ స్థాయిలో నీరు వచ్చి ఉంటుందని అనుకుంటున్నాం. బైరెడ్డి వెంకటేశ్వర్లు, మైన్‌‌ మేనేజర్‌‌..