సోలార్ విద్యుత్ పైలట్ ప్రాజెక్టుగా కొండారెడ్డిపల్లి

సోలార్ విద్యుత్ పైలట్ ప్రాజెక్టుగా కొండారెడ్డిపల్లి
  • టీజీఎస్ఎస్​పీడీసీఎల్​ సీఎండీ ముషారఫ్‌‌‌‌‌‌‌‌  అలీ ఫారూఖీ 

వంగూర్, వెలుగు : నాగర్ కర్నూల్​ జిల్లా వంగూరు మండలంలోని సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లెలో సోలార్  విద్యుత్  పైలట్  ప్రాజెక్టు ఏర్పాటుపై ప్రణాళికలు రూపొందించనున్నట్లు టీజీఎస్ఎస్​పీడీసీఎల్​ సీఎండీ ముషారఫ్‌‌‌‌‌‌‌‌  అలీ ఫారూఖీ తెలిపారు. సోలార్  విద్యుత్  పైలట్  ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా మంగళవారం కలెక్టర్  బదావత్  సంతోష్, అధికారులతో కలిసి గ్రామస్తులతో చర్చించారు. గ్రామంలోని ప్రజలు, రైతుల అభిప్రాయాలను సేకరించారు.  సోలార్  విద్యుత్ పై గ్రామస్తులు తమ సందేహాలను సమావేశంలో ప్రస్తావించగా, సంబంధిత అధికారులు వాటిని నివృత్తి చేశారు.

ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సోలార్  విద్యుత్ ను వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద రెండు గ్రామాలను ఎంపిక చేసిందని చెప్పారు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లితో పాటు ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామాన్ని గుర్తించామని తెలిపారు. గ్రామంలో వారం రోజుల పాటు సోలార్  విద్యుత్ కు సంబంధించిన అధికారుల బృందం పర్యటించి వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరిస్తారని చెప్పారు.

అధ్యయన బృందాలు గ్రామాల్లో పర్యటించి అవగాహన కలిగిస్తాయని, దీనికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. కలెక్టర్  మాట్లాడుతూ.. సోలార్  విద్యుత్ ను గృహ, వ్యవసాయ, వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకోవచ్చని తెలిపారు. దీంతో భవిష్యత్తులో రైతులకు విద్యుత్  సమస్యలు ఎదురుకాకుండా చూడవచ్చని, నాణ్యమైన కరెంట్​ను పొందవచ్చని పేర్కొన్నారు. అనంతరం సీఎండీ, కలెక్టర్  గ్రామంలో పర్యటించి వివిధ వర్గాల ప్రజలతో ముచ్చటించారు.

సోలార్  విద్యుత్​తో జరిగే లాభాలను వివరించారు. ఆ తరువాత కల్వకుర్తి తహసీల్దార్  ఆఫీస్ లో సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్​ అందించేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెడ్ కో మేనేజింగ్  డైరెక్టర్  అనిలా, సెర్ప్​ డైరెక్టర్  కృష్ణ, డైరెక్టర్  రాములు, అడిషనల్​ కలెక్టర్  దేవ సహాయం, డిస్ట్రిక్ట్​ వెటర్నరీ ఆఫీసర్ జీవీ రమేశ్  పాల్గొన్నారు.