జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలోని కొండ్రికర్ల, కోనరావుపేట గ్రామాల మధ్య.. గుట్ట మట్టి తవ్వకాలపై వివాదంపై కొనసాగుతుంది. కొండ్రికర్ల గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న(ఆగస్టు 17) కోనరావుపేట గ్రామస్థులు చేసిన రాస్తారోకోకు కౌంటర్ గా ఈరోజు(ఆగస్టు 18) కొండ్రికర్ల గ్రామస్థులు.. గుట్ట దగ్గర ధర్నా చేపట్టారు. గుట్ట నుంచి తాము మట్టి తీసుకెళ్తున్నామంటూ కోనరావుపేట గ్రామస్థులు జాతీయ రహదారిపై ధర్నా చేయడం పట్ల కొండ్రికర్ల వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధిక వర్షాలకు కొట్టుకపోయిన రోడ్డు మరమ్మత్తు కోసం తాము మట్టి తీసుకెళ్తే.. తమ ఊరి ట్రాకర్లను, జేసీపీని సీజ్ చేసి కేసు నమోదు చేయడం పట్ల ఆందోళన చేపట్టారు. పోలీసులు తమపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని కొండ్రికర్ల గ్రామస్తులు డిమాండ్ చేశారు. కేవలం కొందరి స్వార్థం కోసం కోనరావుపేట్ గ్రామస్తులను రెచ్చగొట్టి.. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి.. ఇరు గ్రామాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని కొండ్రికర్ల గ్రామస్తులు డిమాండ్ చేశారు.
ఏం జరిగిందంటే..
జగిత్యాల జిల్లాలో మట్టి అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ.. కోనరావుపేట గ్రామస్థులు నిన్న(ఆగస్టు 17) ధర్నాకు దిగారు. కోనరావుపేట గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్పల్లి మండలం కోనరావు గ్రామ శివారు నుంచి కొండ్రికర్ల గ్రామస్థులు గుట్టను తవ్వి అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. విషయాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై చాలా రోజులుగా కోనరావుపేట, కొండ్రికర్ల గ్రామస్థుల మధ్య వివాదం నడుస్తోంది.
ఆగస్టు 16 రాత్రి అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ లను స్థానికులు పట్టుకొని కోనరావుపేట్ కు తరలించారు. కొండ్రికర్ల గ్రామస్తులు రాత్రి కోనరావుపేటకు వచ్చి గ్రామపంచాయతీ సిబ్బందిపై దాడి చేసి జేసీబీ, ట్రాక్టర్లు తీసుకెళ్లినట్టు ఆరోపిస్తున్న కోనరావుపేట్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిందితులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ.. గ్రామస్థులు రాస్తారోకో చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థులకు సర్ది చెప్పడానికి ప్రయత్నించగా, ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.