జడ్చర్ల మున్సిపల్​ చైర్​పర్సన్​గా పుష్పలత

జడ్చర్ల మున్సిపల్​ చైర్​పర్సన్​గా పుష్పలత

జడ్చర్ల, వెలుగు : మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మున్సిపల్​ చైర్ పర్సన్​ గా బీఆర్​ఎస్​కు చెందిన కోనేటీ పుష్పలత సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.   ఈ మున్సిపాల్టీ ఏర్పడి మూడున్నర ఏండ్లు మాత్రమే అయ్యింది. మొదటి   పాలకవర్గంలోనే  ఆధిపత్య పోరు, చైర్ పర్సన్​.. ఇతర సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడంతో   సభ్యులందరూ ఇటీవల అవిశ్వాసం ప్రకటించారు.  దీంతో  అధికారులు సోమవారం ఎన్నిక నిర్వహించారు.  

బీఆర్​ఎస్​కు 20 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్​కు ఆరు, బీజేపీకి ఒకరి బలం ఉండగా.. ఏకగ్రీవంగా చైర్​పర్సన్​ను ఎన్నుకున్నారు. బీఆర్​ఎస్​  నుంచి 14వ వార్డుకు చెందిన కౌన్సిలర్ కోనేటి పుష్పలత పేరును 26 వ వార్డు కౌన్సిలర్ శశి కిరణ్ ప్రతిపాదించారు.  చైర్ పర్సన్ పదవికి ఒకే ఒక్క నామినేషన్ రావడంతో  ఎన్నిక ఏకగ్రీవమైందని  రిటర్నింగ్ అధికారి, మహబూబ్​నగర్​ ఆర్డీవో నవీన్ తెలిపారు.  ముందు నుంచి బీఆర్​ఎస్​కు చెందిన  22వ కౌన్సిలర్​ కావలి శ్రీశైలమ్మను చైర్​పర్సన్​గా చేయాలని మాజీ ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి భావించారు.  కొందరు కౌన్సిలర్లు దీన్ని  వ్యతిరేకించారు. ఆమెకు మద్దతు ఇవ్వాల్సి వస్తే తాము పార్టీ మారుతామనే హెచ్చరిక చేసినట్లు  చర్చ  సాగింది. దీంతో  14వ వార్డుకు చెందిన కోనేటి పుష్పలతను ఏకగ్రీవమయ్యారు.