పాల్వంచ, వెలుగు: డబ్బు ప్రభావంతో కమ్యూనిస్టులు గెలవలేకపోవచ్చునేమో గానీ ప్రభుత్వాలను నిలబెట్టే, పడగొట్టే సత్తా తమకే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజాపోరు యాత్రలో భాగంగా మంగళవారం పాల్వంచలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో రూ.5వేలు,10 వేలు పంచి రాజకీయాలను నాశనం చేస్తున్నారని ఆయన ఫైరయ్యారు. 10 సీట్లు నావేనని ఒక్కరంటే, గేటు దాటనివ్వనని ఇంకొకరు అంటున్నారని.. అంటే జిల్లాలో కమ్యూనిస్టులకు బలమే లేదా అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు అమ్ముడు పోయారని అనడం పరిపాటిగా మారిందని.. జిల్లాలో ఎవరు ఒకే పార్టీలో ఉన్నారో చెప్పాలని సవాల్ చేశారు. న్యాయమైన వ్యాపారం చేస్తే వేలకోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని, 20 ఏళ్లుగా తాము రాజకీయాలు చేస్తున్న ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టేందుకు డబ్బులే ఉండవన్నా రు. జిల్లా నాయకులు ముత్యాల విశ్వనాథం అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కల్లూరి వెంకటేశ్వర్లు, మున్నా లక్ష్మీకుమారి, ఏపూరి బ్రహ్మం, అడుసుమల్లి సాయిబాబా, ఉప్పుశెట్టి రాహుల్, సీపీఎం పట్టణ కార్యదర్శి దొడ్డ రవి కుమార్ పాల్గొన్నారు.
ములకలపల్లి, వెలుగు: విస్తారమైన నిక్షేపాలు ఉన్నా.. భద్రాది కొత్తగూడెం జిల్లా వెనకబడిందని.. ఈ అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఏకె. సాబీర్ పాషా అన్నారు. సీపీఐ జిల్లావ్యాప్తంగా చేపట్టిన ప్రజాపోరు యాత్ర మంగళవారం ములకలపల్లిలో జరిగింది. సీపీఐ నాయకులు శ్రీరాముల నర్సింహం స్మారక స్తూపాన్ని సాబీర్ పాషా ఆవిష్కరించారు. జిల్లాలో సీతారామ ప్రాజెక్టు, బొగ్గు, ఇసుక నిక్షేపాలు విస్తారంగా ఉన్నా ఇక్కడి ప్రజలకు, రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు రావులపల్లి రాంప్రసాద్,
అయోధ్య, నరాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.