![ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు : కూనంనేని సాంబశివరావు](https://static.v6velugu.com/uploads/2025/02/koonanneni-sambasiva-rao-said-declaring-support-for-congress-party-in-graduate-teacher-mlc-elections_nB6C9lKbUg.jpg)
- స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం
హైదరాబాద్/చేవెళ్ల, వెలుగు: ప్రస్తుతం గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. మిగిలిన టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎస్‌టీయూ ఉపాధ్యాయ సంఘం నాయకులతో చర్చలు జరుపుతున్నామన్నారు. బుధవారం హైదరాబాద్ మగ్దూం భవన్‌లో సీపీఐ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వైఖరిపై సీపీఐ పొత్తు ఆధారపడి ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ కలిసొస్తే ఆ పార్టీతో ముందుకెళ్తామని, లేకపోతే తమ పార్టీకి బలం ఉన్న చోట్ల ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించారు.
-ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనను స్వాగతిస్తున్నామన్నారు. పదేండ్లుగా కేంద్రంలో అధికారం ఉండి, హిందుత్వ మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం.. హిందువుల అభ్యున్నతికి ఏం చేసిందని ప్రశ్నించారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో దేశ రాజకీయాలు ప్రమాదంలో పడ్డాయని, ఇండియా కూటమి విచ్ఛిన్నం అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. మావోయిస్టులను ఎన్‌కౌంటర్ పేరుతో చంపేస్తున్నారని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. బహిరంగ ప్రకటన చేసి ఎన్‌కౌంటర్లు చేయిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
రంగరాజన్‌కు కూనంనేని పరామర్శ
చిలూకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై రామరాజ్యం సంస్థ ముసుగు ధరించి దాడి చేయడం బాధాకరమని కూనంనేని సాంబశివరావు అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్ఎస్, వీహెచ్ ప్రేరణతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. దాడులకు పాల్పడినవారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బుధవారం రంగరాజన్ ఇంటికెళ్లి.. ఆయనను పరామర్శించారు. సకల మతాలకు నిలయమైన భారతదేశంలో, రాముడి పేరుతో రాజకీయాలు, దౌర్జన్యాలు జరగడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. నిజమైన రామ భక్తులు ఎవ్వరూ ఇతరులపై దాడి చేయరన్నారు. రామరాజ్యం స్థాపన అంటే దౌర్జన్యాలు కాదని హితవు పలికారు. నిజమైన రామ భక్తులు, దేశభక్తులు కమ్యూనిస్టులేనని ఆయన పేర్కొన్నారు.