సింగరేణి రిటైర్డ్​ కార్మికులను గోస పెట్టొద్దు : కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  సింగరేణిలో దశాబ్దకాలంగా పనిచేసిన రిటైర్డ్​  కార్మికులను గోస పెట్టవద్దని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.  కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​ ఎదుట రిటైర్డ్​ కార్మికులు సోమవారం చేపట్టిన ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు.  చాలా మంది రిటైర్డ్​ కార్మికులకు రూ. 300 నుంచి రూ. వెయ్యిలోపే పెన్షన్​ రావడం బాధాకరమని అన్నారు. హాస్పిటల్స్​ నుంచి వైద్యం పొందే మాజీ కార్మికుల నుంచి 40శాతం ఫీజులు వసూలు చేయడం ఆపేసి,  ఉచిత వైద్యం అందించాలన్నారు.  

కనీస పెన్షన్​ రూ. 10వేలు చెల్లించే విధంగా యాజమాన్యం చర్యలు చేపట్టాలన్నారు. మాజీ కార్మికులకు సొంతింటి సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో  వర్క్ ర్స్​ యూనియన్​ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్​కుమార్​, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య పాల్గొన్నారు.