మేడిగడ్డకు ఎందుకు పోతున్నరు ? : కూనంనేని సాంబశివరావు

మేడిగడ్డకు ఎందుకు పోతున్నరు ? :  కూనంనేని సాంబశివరావు
  •    పార్లమెంట్‍ ఎన్నికల తర్వాత బీఆర్‍ఎస్‍ పరిస్థితి ఇంకా ఘోరమైతది
  •     అన్నీ నాకే తెలుసనుకున్నాడు కాబట్టే కేసీఆర్‍ దెబ్బతిన్నడు
  •     సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

వరంగల్‍, వెలుగు : 'సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మేడిగడ్డకు వెళ్తే.. ఏం పీకడానికి వెళ్లారంటూ కేసీఆర్‍ చిన్నతనంగా మాట్లాడారు, ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్లు ఎందుకు పోతున్నారో చెప్పాలి' అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‍ చేశారు. హనుమకొండ జిల్లా ఆఫీస్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయన్నారు. తనకే అన్నీ తెలుసన్న భ్రమలో ఉన్నందునే కేసీఆర్ దెబ్బతిన్నారన్నారు. కాగ్‍పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇప్పటికైనా మారకుంటే పిచ్చోడి కింద లెక్కగడుతారన్నారు. బీఆర్ఎస్ మొదట్లో సెంటిమెంట్ ను, రెండోసారి డబ్బులను నమ్ముకుందని, అందుకే పేకమేడలా కూలిపోయిందన్నారు. పార్లమెంట్‍ ఎన్నికల తర్వాత బీఆర్‍ఎస్‍ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవుతుందన్నారు.

కేసీఆర్‍, కేటీఆర్‍, హరీశ్ రావుకు అధికారంపై ఇంకా మోజు పోలేదని, అందుకే కుర్చీల కొట్లాట చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉద్యోగాలు, రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా, ఇంటింటికీ రాముడి అక్షింతలు పంపి ఓట్ల రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్‍ఎస్‍ సెంటిమెంట్‍తో రెచ్చగొడితే బీజేపీ మతం పేరుతో రెచ్చగొడుతోందన్నారు. కమ్యూనిస్టులతో కలవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందన్నారు. పార్లమెంట్‍ ఎన్నికల్లో సీపీఐకి ఒక్క ఎంపీ సీటైనా ఇవ్వాలని కోరారు. సమావేశంలో సెక్రటరీ కర్రె భిక్షపతి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, బి.విజయసారథి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, పంజాల రమేశ్‍, సిరబోయిన కరుణాకర్ పాల్గొన్నారు.