ధర్మపురి, వెలుగు: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తనను మోసం చేశాడని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పడకల్ కు చెందిన నిమ్మ భరత్ ఆరోపించాడు. బుధవారం వెల్గటూర్ లో బుధవారం మీడియా ఎదుట తన గోడు వెల్లబోసుకున్నాడు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తాను రెండు నెలలుగా సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్, సోషల్ మీడియా ప్రమోటర్‌గా పనిచేస్తున్నానని, ఇందుకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో రూ. 10 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్లు చెప్పాడు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, తనకు కుటుంబం ఉందని, ఒప్పందం మేరకు డబ్బులు ఇవ్వాలని మాజీ మంత్రి కొప్పులను వేడుకున్నాడు.
న్యాయం జరగకపోతే మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి కూడా తీసుకువెళ్తానని చెప్పారు. దీనికి సంబంధించి కొప్పుల ఈశ్వర్‌తో మాట్లాడిన కాల్ డేటా, చాటింగ్, పంపించిన వీడియోస్, ఫొటోస్ అన్నీ ఉన్నాయని చెప్పాడు. అయితే, మీడియాతో మాట్లాడుతున్న భరత్‌ను అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ లీడర్ మూగల సత్యం బెదిరించాడు. కొప్పుల ఈశ్వర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నావని, అంతు చూస్తామంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో తనకు ఎలాంటి హాని జరిగిన కొప్పుల ఈశ్వర్‌దే బాధ్యత అంటూ స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు భరత్ తెలిపారు. కాగా, తనను రూ.10 లక్షలు ఇవ్వాలంటూ నిమ్మ భరత్ బెదిరిస్తున్నాడని, ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ రామగుండం సీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.