వంశీకృష్ణ మీద గెలవలేక కొప్పుల ఈశ్వర్ చిల్లర రాజకీయాలు

వంశీకృష్ణ మీద గెలవలేక కొప్పుల ఈశ్వర్ చిల్లర  రాజకీయాలు

ధర్మారం,వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మీద గెలవలేకనే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చిల్లర, సానుభూతి  రాజకీయాలను నడుపుతున్నారని  కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాడే సూర్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం ధర్మారం మండల కేంద్రంలో  పార్టీ  మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి  ప్రెస్ మీట్ నిర్వహించారు.  ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవను రాజకీయాలకు అంటగడుతున్నారని అన్నారు.  గతంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లు కొనిచ్చి, నెల నెల జీతాలు ఇచ్చి కాంగ్రెస్ నాయకుల మీదకి ఉసి గొల్పింది కొప్పుల ఈశ్వర్ అని ఆరోపించారు. 

 సాల్వజి మాధవరావు అనే వ్యక్తి ధర్మారం మండలంలో సోషల్ మీడియాలో విచ్చల విడిగా పోస్టులు పెడుతూ కాంగ్రెస్ కార్యకర్తలను కులం పేరుతో మానసికంగా వేదించినందుకు పోలీసులు   కేసు నమోదు చేసి జైలు కు పంపించారని తెలిపారు.  దీనిని కొప్పుల ఈశ్వర్ రాజకీయాలకు వాడుకోవడం, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ను  బద్నాం చేయడం  సరికాదన్నారు.  కేసీఆర్ తో సంగారెడ్డి బహిరంగ సభలో చెప్పించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. 

గడ్డం వంశీ మీద  పోటి చేస్తున్న కొప్పుల ఈశ్వర్ కు డిపాజిట్ కూడా రాదని, అందుకే మతిభ్రమించి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు దేవి జనార్ధన్, రవీందర్ రెడ్డి, మెడవేని తిరుపతి, వేణుమాధవ్, ఏదుల శ్రీనివాస్, కాంపెలి రాజేశం, ఒరేం చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.