కల్వకుంట్ల కుటుంబానికి చరమగీతం పాడాలి: కోరం కనకయ్య

కామేపల్లి, వెలుగు :  అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నయ వంచనకు గురవుతోందని, దీనికి కారణమైన కల్వకుంట్ల కుటుంబానికి చరమగీతం పాడాలని ఇల్లెందు కాంగ్రెస్​ అభ్యర్థి కోరం కనకయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని పండితాపురం, బండిపాడు, రుక్కీ తండా, రాయి గూడెం, కొత్త లింగాల,  సాతాని గూడెం, ముచ్చర్ల, జాస్తిపల్లి గ్రామాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వనరులు దోపిడీకి గురయ్యాయని, ఇంకా బీఆర్ఎస్ పాలన కొనసాగితే ప్రజలు తమ హక్కులను కోల్పోతారని హెచ్చరించారు. ప్రజలందరికీ మేలు జరగాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. ఇదిలా ఉండగా కోరం కనకయ్య పండితాపురం పర్యటనలో  పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించారు. ఇదే గ్రామానికి చెందిన అడ్వకేట్, సీపీఐ జిల్లా నాయకుడు బోడేంపుడి విఠల్ రావు కోరం కనకయ్య ఎన్నికల సభలో  పాల్గొనగా మీతో మాట్లాడే పని ఉంది కిందికి రమ్మని పోలీసులు పిలిచారు. తాను ఎన్నికల ప్రచారంలో ఉన్నానని నేరుగా పోలీస్ స్టేషన్ కు వస్తానని చెప్పారు.

దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు. బీఆర్ఎస్  పార్టీ నేతలు తనపై పోలీసులను ఉసిగొలుపుతున్నారని కొత్త లింగాలలో విఠల్ రావు విలేకరులకు తెలిపారు. ప్రచారంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు ఏపూరి మహేందర్  కుమార్, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ సర్పంచులు సునీత, సులోచన, ఎంపీటీసీ సభ్యులు రామ్ రెడ్డి జగన్నాథరెడ్డి,  నల్లమోతు లక్ష్మయ్య, వైఎస్ఆర్సీపీ ఇల్లెందు నియోజకవర్గ ఇన్​చార్జి సుజాత మంగిలాల్, టీడీపీ జిల్లా నాయకుడు తోటకూరి శివయ్య, కాంగ్రెస్ మండల నాయకులు బానోత్ నరసింహా నాయక్, మేకల మల్లికార్జున రావు, దొడ్ల వేణు, దేరంగుల రామకృష్ణ, బత్తుల ఉపేందర్, శబరి నాథ్, అప్పన పిచ్చయ్య,  సిరిపురం రవి, కోలా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : సింగరేణి ఏరియాను బొందలగడ్డ చేశారు : మక్కాన్ సింగ్