మంచినీటి ఎద్దడి నివారణకు యాక్షన్​ ప్లాన్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా ఆఫీసర్లు యాక్షన్​ ప్లాన్​ రూపొందించాలని జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య ఆదేశించారు. జడ్పీ మీటింగ్​ హాల్​లో బుధవారం జిల్లా ప్రజాపరిషత్​ జనరల్​ బాడీ మీటింగ్​ చైర్మన్​ కోరం కనకయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. మిషన్​ భగీరథ నీళ్లను సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు. జిల్లా హాస్పిటల్​తో పాటు పలు పీహెచ్​సీలలో మందులు సక్రమంగా అందుబాటులో ఉండడం లేదని జడ్పీటీసీలు వెంకటరెడ్డి, మేరెడ్డి వసంత, ఎంపీపీ కోదండరామయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఆసుపత్రిలో చాలా మందులు బయట కొనుక్కోవాలని చెప్పడం సిగ్గు చేటన్నారు.

మెడికల్​ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రి నుంచి రోగులను హైదరాబాద్​కు రిఫర్​ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనరల్​ హాస్పిటల్​తో పాటు పీహెచ్​సీలలో డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదన్నారు. రేగళ్ల పీహెచ్​సీలో డాక్టర్లు లేకపోవడంతో గ్రామస్తులంతా ఆందోళన చేశారని సమావేశంలో ప్రస్తావించారు. కొత్తగూడెం, మణుగూరు హాస్పిటల్స్​లలో గర్భిణి, బిడ్డ మృతి చెందిన ఘటనపై విచారణ చేపట్టారే తప్ప యాక్షన్​ తీసుకోలేదన్నారు. వైద్యశాఖ రివ్యూ అయిపోయిన తర్వాత జనరల్​ హాస్పిటల్​ సూపరింటెండెంట్​ రావడం పట్ల జడ్పీ చైర్మన్​ అసహనం వ్యక్తం చేశారు. మిషన్​ భగీరథ నీళ్లు అన్ని హ్యాబిటేషన్లకు ఇస్తున్నామని ఆఫీసర్లు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదన్నారు. పైప్​లైన్​ లీకేజీలను అరికట్టడంలో ఆఫీసర్లు విఫలమవుతున్నారని మండిపడ్డారు. పైపులు పగిలిపోతున్నా రిపేర్లు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. జూలూరుపాడు మండలంలో విద్యార్థినితో టీచర్​ అసభ్యంగా ప్రవర్తించారని, ఆయనపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

టీచర్​పై పోలీస్​లు పోక్సో కేసు నమోదు చేశారని డీఈఓ సోమశేఖర శర్మ సమాధానమిచ్చారు. లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్​ మండల ఆఫీస్​లలో తమకు ప్రత్యేక గదులు కేటాయిస్తామని పలు జడ్పీ మీటింగ్​లలో హామీ ఇచ్చినా అమలు కావడం లేదని జడ్పీటీసీలు వాపోయారు. చెప్పిన సమస్యలను నోట్​ చేసుకోవడం తప్ప వాటిని పరిష్కరించడంపై దృష్టి పెట్టడం లేదన్నారు. అనంతరం 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.60.30 కోట్లతో జడ్పీ బడ్జెట్​ను సభ్యులు ఆమోదించారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ కె వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో విద్యాలత, వైస్​ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

జాడలేని ఎమ్మెల్యేలు..

ఎంతో ప్రాధాన్యత ఉన్న జడ్పీ జనరల్​ బాడీ మీటింగ్​కు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలలో ఒక్కరంటే ఒక్కరూ కూడా అటెండ్​ కాలేదు. ఐటీడీఏ ప్రాజెక్ట్​ ఆఫీసర్​ రాలేదు. కొందరు జిల్లా ఆఫీసర్లు తమ బదులు కింది స్థాయి ఆఫీసర్లను మీటింగ్​కు పంపించగా, జడ్పీ చైర్మన్​తో పాటు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.