- మంత్రి శ్రీధర్ బాబుతో కంపెనీ ప్రతినిధుల భేటీ
- రీసెర్చ్, బయో మెడికల్ సెంటర్ల ఏర్పాటుకు భరోసా
- 750 ఎకరాల్లో రూ.300 కోట్లతో స్మార్ట్ షూ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆసక్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ స్మార్ట్ హెల్త్ సిటీని నెలకొల్పేందుకు కొరియాకు చెందిన షూ ఆల్స్ సంస్థ ముందుకొచ్చింది. 5 వేల ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే.. ఆసియాలోనే ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో స్మార్ట్ హెల్త్ సిటీ నిర్మిస్తామని ప్రతిపాదించింది. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ లాంటి ప్రఖ్యాత హాస్పిటల్స్‌ను తీసుకొస్తామని, రీసెర్చ్, బయో మెడికల్ సెంటర్లు, యాన్సిలరీ పరిశ్రమలను ఏర్పాటు చేసేలా స్మార్ట్ హెల్త్ సిటీని డెవలప్ చేస్తామని తెలిపింది.
సెక్రటేరియెట్‌లో షూ ఆల్స్ సంస్థ చైర్మన్ చెవోంగ్ లీ, ప్రతినిధులు గురువారం మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. స్మార్ట్ హెల్త్ సిటీ ఏర్పాటు చేస్తే పెట్టుబడులతో పాటు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని వివరించారు. అయితే, చిన్న పట్టణాల్లో వాటిని ఏర్పాటు చేస్తే ఆ ప్రతిపాదనను పరిశీలిస్తామని సంస్థ ప్రతినిధులకు శ్రీధర్ బాబు చెప్పారు.
పది వేల అడుగులు వేస్తే.. 25 వాట్ల విద్యుత్ ఉత్పత్తి
స్మార్ట్ షూను తయారు చేసే ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు కూడా సంస్థ ఆసక్తి కనబరిచిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘‘750 ఎకరాలు కేటాయిస్తే రూ.300 కోట్లతో అధునాతన షూ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. 87 వేల మందికి ఉపాధి కల్పించేలా గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. షూ బాటమ్(సోల్స్)లో మెడికల్ చిప్ ఉండే బూట్లు తయారు చేస్తామన్నారు.
పది వేల అడుగులు వేస్తే 25 వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే షూతో పాటు డయాబెటిస్, ఆర్థరైటిస్ ఉన్న వారికి ఉపశమనం కలిగించే ఉత్పత్తులను తయారు చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పిన్రు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చాను’’అని శ్రీధర్ బాబు వివరించారు.
రైన్లాండ్, తెలంగాణ మధ్య సిస్టర్ స్టేట్ సహకారం
జర్మనీలోని రైన్లాండ్ స్టేట్.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సెక్రటేరియెట్‌లో రైన్లాండ్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ డేనియెలా ష్మిట్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం శ్రీధర్ బాబుతో సమావేశమైంది. రైన్లాండ్, తెలంగాణ ‘సిస్టర్ స్టేట్’ సహకార సంబంధాలు కలిగి ఉండాలని నిర్ణయించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఆకట్టుకునేలా టీ స్క్వేర్
రాయదుర్గంలో నిర్మించే ఐకానిక్ ‘టీ స్క్వేర్’ పర్యాటకులను ఆకట్టుకునేలా ఉండాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు. గురువారం సెక్రటేరియెట్‌లో టీ స్క్వేర్ నిర్మాణ డిజైన్లపై పలు సంస్థలు ప్రజెంటేషన్ ఇచ్చాయి. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ తరహాలో రాయదుర్గంలో టీ స్క్వేర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అందుకు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) టెండర్లను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలోనే పలు సంస్థలు ప్రజెంటేషన్ ఇచ్చాయి.
ఆ డిజైన్లను పరిశీలించిన మంత్రి.. పలు సూచనలు ఇచ్చారు. భారీ ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు, డిజిటల్ ప్రకటనలతో ఆ ప్రాంతమంతా వెలిగిపోవాలని సంస్థల ప్రతినిధులకు సూచించారు. వ్యాపారం, వినోదం, పర్యాటకంతో సందర్శకులు ఉల్లాసంగా గడిపేలా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సింగింగ్ కన్సర్ట్‌లను నిర్వహించుకునేలా ఆ ఏరియాను డిజైన్ చేయాలని సూచించారు. 24 గంటలపాటు తెరిచి ఉంచేలా యాంఫీ థియేటర్లు, ఓపెన్ రెస్టారెంట్లను ఏర్పాటు చేయాలన్నారు.