కోరుట్ల, వెలుగు: కోరుట్లలోని సోషల్ వెల్ఫేర్ మహిళా రెసిడెన్షియల్ అగ్రికల్చర్ కాలేజీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని స్టూడెంట్స్ పేరెంట్స్ కమిటీ సభ్యులు విన్నవించారు. శనివారం హైదరాబాద్ లోని సచివాలయంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ లను పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో స్టూడెంట్ల తల్లిదండ్రులు కలిసి వినతి పత్రం అందజేశారు. కోరుట్ల అగ్రికల్చర్ కాలేజీలో రెండు సంవత్సరాల నుంచి సరైన సౌకర్యాలు లేవని, పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ లేదన్నారు. ప్రాక్టికల్స్ కోసం సరైన ల్యాబ్‌లు, వ్యవసాయ భూమి లేదన్నారు.
కాలేజీ ప్రభుత్వ గుర్తింపులో కూడా లేనందున ఐకార్ సర్టిఫికేట్ వస్తుందో లేదోనని ఆందోళనలో స్టూడెంట్స్ ఉన్నారని తెలిపారు. మొదటి సంవత్సరం అడ్మిషన్ నోటిఫికేషన్ ఇప్పటికి ఇవ్వలేదన్నారు. సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి , ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. మంత్రులను కలిసిన వారిలో పేరెంట్స్ కమిటీ సభ్యులు నర్సయ్య, సత్యం, నాగభూషణం,సాయికుమార్, జ్యోతి, కాశయ్య తదితరులున్నారు.