భగీరథ అధికారులు పురుగులు పడి చస్తరు : కోరుట్ల ఎమ్మెల్యే

  • భగీరథ అధికారులు పురుగులు పడి చస్తరు
  • ఇంటింటికీ నీళ్లియ్యని ఆఫీసర్లను బంధించండి
  • కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలె
  • మెట్​పల్లి మండల సమావేశంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఫైర్

మెట్ పల్లి, వెలుగు : ‘మూడేళ్లుగా నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నరు.. ప్రతి మీటింగ్ లో తాగు నీటి సమస్యపై ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నరు.. సమాధానం చెప్పలేక నల్ల మొఖం అయితాంది.. తాగునీటి కోసం తిప్పలు పెడుతున్న మిషన్ భగీరథ అధికారులు ప్రజల కలకల తగిలి పురుగులు పడి చస్తరు’ అంటూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మిషన్​భగీరథ ఆఫీసర్లపై ఫైర్ అయ్యారు. మంగళవారం ఎంపీపీ మారు సాయిరెడ్డి అధ్యక్షతన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

సమావేశానికి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లో ఆరు నెలలుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదని,  తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రతి మీటింగ్ లో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లారగానే ప్రజలు సర్పంచుల ఇంటి వద్దకు వచ్చి తాగునీటి కోసం తిట్టిపోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారేమో మిషన్ భగీరథ నీరు ఇస్తున్నామని చెప్పి బోర్ల కనెక్షన్లు తొలగించిందన్నారు.

ప్రస్తుతం తాగునీటి కోసం మళ్లీ కరెంట్ కనెక్షన్లు పెట్టించి బోర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పారు. మేజర్ పంచాయతీలు నెలకు రూ.లక్షకు పైగా కరెంట్ బిల్లులు కడుతున్నాయని, చిన్న పంచాయతీలు కరెంట్ బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వాపోయారు. తాగునీటి సమస్య తీర్చాలని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును వేడుకున్నారు. 

నీళ్లిస్తున్నామని సీఎం అనుకుంటున్నరు.. కానీ

జిల్లాలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారు.. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అలా జరగడం లేదని, మూడేళ్లలో మూడు నెలలు కూడా భగీరథ నీళ్లు ఇవ్వలేదని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఉద్దరిస్తాడని పెద్ద కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తే అదేమో పని చేయక డబ్బులు తీసుకొని చేతులెత్తేసిందన్నారు. కాంట్రాక్టర్లకు నోటీసులు ఇస్తే ఏమైతది.. బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు.

ప్రజల కనీస అవసరమైన తాగునీరు ఇయ్యకుంటే తాము పదవిలో ఉండి ఎందుకన్నారు. తాగునీటి కోసం భగీరథ అధికారులను ప్రజలు తిట్టే తిట్లు భరించక నేనైతే ఉరేసుకుని చస్తుండే.. మీరేమో చెవిటోని దగ్గర శంఖం ఊదినట్లు సిగ్గులేకుండా ఉంటున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పట్టించుకోని అధికారులను రూంలలో వేసి నిర్బంధించాలని సర్పంచులతో అన్నారు. ‘నెలనెలా రూ. లక్షల్లో జీతం తీసుకొని ఏసీ రూముల్లో పడుకొని నౌకరీ చేస్తున్నరు. ప్రజల నీటి కష్టాలు ఎప్పుడు తీరుస్తరు. పనిచేయ చాతకాకుంటే బదిలీ చేసుకొని వెళ్లిపోండి.

నేనే కోరుకున్న చోట ట్రాన్స్​ఫర్​చేయిస్త. ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తలేరని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రిపోర్టర్లు గట్టిగా రాయున్రీ. ఇంటింటికీ తాగునీరు అందడం లేదని హైదరాబాద్ దాకా తెలిసేలా పెద్దగా రాయున్రీ’ అన్నారు.  15 రోజుల్లో లీకేజీ, ఇతర సమస్యలు పరిష్కరించి నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, మండలాల్లోని అన్ని గ్రామాల్లో  ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో భగీరథ డీఈ ప్రేమ్ కుమార్, ఆర్​డబ్ల్యూఎస్​డీఈ ఆనంద్, ఎంపీడీఓ భీమేశ్, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.