ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్సై .. సెల్‌‌ఫోన్‌‌ను తిరిగి ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్‌‌

ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్సై .. సెల్‌‌ఫోన్‌‌ను తిరిగి ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్‌‌

కోరుట్ల, వెలుగు : పేకాట ఆడుతూ దొరికిన వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌‌ఫోన్‌‌ను తిరిగి ఇచ్చేందుకు లంచం తీసుకున్న కోరుట్ల ఎస్సైని ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, బాధితుడు బండారి శ్రీనివాస్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్‌‌పల్లి గ్రామ శివారులోని ఓ మామిడి తోటలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని గత నెల 21న స్పెషల్‌‌ క్రైం బ్రాంచ్‌‌ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.23 వేలు, ఎనిమిది సెల్‌‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న క్రైం బ్రాంచ్‌‌ పోలీసులు కేసును కోరుట్ల పోలీస్‌‌స్టేషన్‌‌కు ట్రాన్స్‌‌ఫర్‌‌ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న కోరుట్ల టౌన్‌‌ 3 ఎస్సై శంకర్‌‌ ఏడుగురికి సెల్‌‌ఫోన్లు తిరిగి ఇచ్చాడు. 

మరో వ్యక్తి, రాయికల్‌‌ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన బండారి శ్రీనివాస్‌‌కు ఫోన్‌‌ ఇచ్చేందుకు నిరాకరించాడు. రూ. 5 వేలు ఇస్తేనే సెల్‌‌ఫోన్‌‌ ఇస్తానని చెప్పడంతో శ్రీనివాస్‌‌ తనకు తెలిసిన ఓ పొలిటికల్‌‌ లీడర్‌‌తో ఫోన్‌‌ చేయించి సెల్‌‌ఫోన్‌‌ తీసుకున్నాడు. ఎస్సై శంకర్‌‌ ఇటీవల శ్రీనివాస్‌‌కు ఫోన్‌‌ చేసి ‘మిగతా వాళ్లంతా డబ్బులు ఇచ్చారు.. నీవు కూడా కచ్చితంగా రూ. 4,300 ఇవ్వాల్సిందే, లేదంటే సెల్‌‌ఫోన్‌‌ తిరిగి అప్పగించి, నీ ఆధార్‌‌ కార్డు, ఫొటో తీసుకురా’ అని బెదిరించాడు. దీంతో శ్రీనివాస్‌‌ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. 

వారు సూచనతో బుధవారం శ్రీనివాస్‌‌ స్టేషన్‌‌కు వచ్చి ఎస్సై శంకర్‌‌కు రూ. 5 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఎస్సైని రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. ఎస్సై శంకర్‌‌ను కరీంనగర్‌‌ ఏసీబీ స్పెషల్‌‌ జడ్జి ఎదుట హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు.
 

మరిన్ని వార్తలు