- బల నిరూపణలో 11 మంది కౌన్సిలర్ల మద్దతు
- చైర్‌పర్సన్ సీటు కైవసం
కోస్గి, వెలుగు: కోస్గి మున్సిపల్ చైర్‌పర్సన్ సీటు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఆర్డీవో రామచందర్ అధ్యక్షతన నిర్వహించిన అవిశ్వాస తీర్మానం సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి 11 మంది కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. బీఆర్‌ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన వైస్ చైర్‌పర్సన్ అన్నపూర్ణతో పాటు మరో ఇద్దరు కౌన్సిలర్లు బాలేశ్, శ్రీనివాస్ హస్తం పార్టీకే మద్దతు తెలిపారు.
మొత్తం 16 వార్డులకు ఒకరిపై అనర్హత కేసు పెండింగ్‌లో ఉంది. మరో కౌన్సిలర్ అనారోగ్యంతో మృతి చెందారు. 14 మందికి గాను బల నిరూపణలో కాంగ్రెస్‌కు 11 మంది మద్దతు తెలిపారు. దీంతో కోస్గి మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌కు దక్కింది. అనంతరం అవిశ్వాస తీర్మానం నిలిపివేయాలని కోర్టులో పిటిషన్ వేశానని ఈ అవిశ్వాసంపై కోర్టు వాయిదా వేసిందని మున్సిపల్ చైర్‌పర్సన్ శిరీష ఆర్డీవోకు తెలిపారు. ఆర్డీవో రామచందర్ మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానం అయిపోయిందని ఈ నివేదికను కలెక్టర్‌కు అందజేస్తానని తదుపరి చర్యలు ఆయనే తీసుకుంటారని వెల్లడించారు. కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ అన్నపూర్ణ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.