మహేశ్వరం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తా : కొత్త మనోహర్ రెడ్డి 

మహేశ్వరం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తా : కొత్త మనోహర్ రెడ్డి 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన నాయకుడు కొత్త మనోహర్ రెడ్డి ప్రకటించారు. 2014లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తే తనకు 40 వేలకుపైగా ఓట్లు వచ్చాయని చెప్పారు. ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నారని రేవంత్​రెడ్డిపై ఆరోపణలు చేయడంతో తనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్​ చేశారని చెప్పారు. సస్పెండ్​చేసే ముందు కనీసం తనను పిలిచి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తనతోపాటు మరికొందరు నాయకులు కూడా రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర ప్రమాణం చేశారని చెప్పారు. 

అప్పట్లో బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు తలెత్తడంతో పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పారు. రేవంత్​ పై ఆరోపణలు చేయడంతో తనను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్​చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. మీడియా సమావేశంలో తన సొంత మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రతి నిరుపేద కుటుంబానికి (ఒక్కరికి చొప్పున) తన సొంత స్థలంలో 60 గజాల స్థలం ఇస్తానని హామీ ఇచ్చారు. నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్ల పెళ్లికి పుస్తె, మట్టెలతో పాటు పెళ్లి సామాను కూడా అందిస్తానని హామీ ఇచ్చారు.