కోటగిరి,వెలుగు: 108 అంబులెన్స్ లో కవలలకు గర్భిణి జన్మనిచ్చింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ లో జరిగింది. మంగళవారం ఉదయం పోతంగల్ కు చెందిన విజయ లక్ష్మీకి పురిటినొప్పులు రావటంతో అంబులెన్స్ కు కాల్ చేశారు. అంబులెన్స్ లో ప్రసవం కోసం కోటగిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి సిబ్బంది బోధన్ ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడి సిబ్బంది గర్భిణిని పరీక్షించి నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు.
ఈ క్రమంలో 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో సారంగాపూర్ వద్ద పురిటి నొప్పులు తీవ్రం అయ్యాయి. 108 అంబులెన్స్ ఈఎంటీ గంగాధర్, పైలట్ కలీమ్ పాషా సహాయంగా వచ్చిన మహిళతో కలిసి విజయ లక్ష్మికి ప్రసవం చేశారు. ఆమె మగ, ఆడ కవల పిల్లలకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు. వారిని సిబ్బంది జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఈ సందర్భంగా గర్భిణి కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.