- షేరుకు రూ.2 చొప్పున డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రస్తుత సంవత్సరం మార్చి 31తో ముగిసిన నాలుగో క్వార్టర్లో ప్రైవేట్ రంగ లెండర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ నికరలాభం వార్షికంగా18 శాతం వృద్ధితో రూ. 4,133 కోట్లకు చేరుకుంది. 2022–23 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో కోటక్ బ్యాంక్ రూ. 3,496 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో మొత్తం ఆదాయం రూ. 12,007 కోట్ల నుంచి రూ. 15,285 కోట్లకు పెరిగింది.
నికర లాభం 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.10,939 కోట్ల నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరంలో 26 శాతం పెరిగి రూ.13,782 కోట్లకు చేరుకుంది. 2022–23లో రూ.41,334 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 2023–24లో రూ.56,072 కోట్లకు పెరిగింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 2022–23లో రూ. 21,552 కోట్ల నుంచి రూ. 25,993 కోట్లకు పెరిగింది. ఇది సంవత్సరానికి 21 శాతం పెరిగింది.
మార్చి, 2024లో ఎన్‌ఐఐ రూ. 6,909 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది కాలంలో రూ. 6,103 కోట్లతో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ. మార్చి 31, 2024 నాటికి, స్థూల మొండిబాకీలు 1.39 శాతం కాగా, నికర మొండిబాకీలు 0.34 శాతం ఉన్నాయి. మార్చి 31, 2024తో ముగిసిన సంవత్సరానికి రూ. 5 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు రూ.2 డివిడెండ్‌ను బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది.
ఇదిలా ఉంటే కొత్త క్రెడిట్‌కార్డులు, ఆన్లైన్లో కొత్త ఖాతాలు ఇవ్వొద్దని ఈ బ్యాంకును ఆర్బీఐ ఆదేశించింది.