భీమదేవరపల్లిలో కొత్తకొండ చైర్మన్‌‌‌‌ పదవికి పోటాపోటీ

భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు జనవరి 10 నుంచి ప్రారంభం కానుండడంతో ఆలయ చైర్మన్‌‌‌‌ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ఉత్తర తెలంగాణలో ప్రసిద్దిగాంచిన భధ్రకాళీ సమేత వీరభద్రుడి జాతర ప్రతి ఏటా జనవరి 10న కల్యాణంతో మొదలై నెల రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు సుమారు ఐదు లక్షల మంది హాజరవుతారు. అయితే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధికారంలో ఉన్న పదేళ్లలో ఆలయానికి శాశ్వత కమిటీని నియమించలేదు. జాతర ముందు హడావుడిగా ఉత్సవ కమిటీని ప్రకటిస్తూ ఉత్సవాలను పూర్తి చేసేవారు. తాజాగా కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి రావడంతో చైర్మన్‌‌‌‌ పదవికి తీవ్రమైన పోటీ నెలకొంది.

ఒక్క పదవికి 13 మందికిపైనే ఆశావహులు

కొత్తకొండ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడానికి మరో 15 రోజులే ఉండడంతో హుస్నాబాద్‌‌‌‌ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్​రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌‌‌‌ వర్గీయులు మధ్య చర్చలు, సంప్రదింపులు జోరుగా సాగుతున్నాయి. కొత్తకొండ ఆలయ చైర్మన్‌‌‌‌ పోస్ట్‌‌‌‌ కోసం కేతిరి లక్ష్మారెడ్డి, గజ్జెల రమేశ్‌‌‌‌, కొమురవెళ్లి చంద్రశేఖర్‌‌‌‌ గుప్తా, పిడిశెట్టి కనకయ్య, ఆదరి రవీందర్, కంకల సమ్మయ్య, కొడకండ్ల సుదర్శన్‌‌‌‌రెడ్డి, గణబోయిన కొమురయ్య, ఆర్‌‌‌‌.వెంకట్‌‌‌‌రెడ్డి, చిదురాల స్వరూప, సంపత్, చిట్టంపెల్లి అయిలయ్య, సమ్మయ్య, పొన్నాల మురళి పోటీ పడుతున్నారు. ఎలాగైనా చైర్మన్‌‌‌‌ గిరి దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.