
తన నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని కోరితే తనను సభ నుంచి సస్పెండ్ చేయడమేంటని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించిన తర్వాత ఆయన పోడియం వద్ద ఆందోళనకు దిగారు. దౌర్జన్యంగా తనను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన తప్పేంటో చెప్పాలంటూ నినాదాలు చేశారు. వైసీపీని ప్రజలు అధికారం నుంచి దూరం చేయడం ఖాయమని చెప్పారు. సభలో అధికార పక్షం తీరు బాధకారమని తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల నుండి 12 మంది టీడీపీ సభ్యులను స్వీకర్ తమ్మినేని సీతారం సస్పెండ్ చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పయ్యావుల కేశవ్ , నిమ్మల రామానాయుడును ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. మిగతా వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్వీకర్ తెలిపారు. హౌస్ ను మిస్ లీడ్ చేసినందుకు సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డుతగిలినందుకు సస్పెండ్ చేస్తున్నామని స్పీకర్ తెలిపారు. సస్పెండ్ అయిన వారిలో రామానాయుడు, బెందాళం అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవని, చినరాజప్ప, గణబాబు, పయ్యవుల కేశవ్, గద్దె రామ్మెహన్, రామరాజు, ఏలూరి సంబశివరావు, డోలా వీరాంజనేయస్వామి, రవికుమార్‌లు ఉన్నారు.