సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా.. రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో కొత్త ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న కొత్త ప్రభాకర్ రడ్డి.. గురువారం దుబ్బాక ఆర్డీఓ కార్యాలయానికి అంబులెన్స్ లో వచ్చి.. మంత్రి హరీష్ రావుతో కలిసి నామినేషన్ వేశారు.
నామినేషన్ అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వంద అబ్బద్దలు చెప్పి ఒక్క పెళ్లి చేయాలని పెద్దలు చెప్పేవారని.. కానీ, దుబ్బాకలో వంద అబద్దాలు చెప్పి ఎమ్మెల్యే అయ్యాడని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై మండిపడ్డారు. ప్రభాకర్ రెడ్డి దాడి విషయంలో మొండి కత్తి అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డిని గెలిపించండని.. దుబ్బాక రెవిన్యూ డివిజన్ చేస్తానని మాట ఇస్తున్నానన్నారు.
మీరే ఒక్కో ప్రభాకర్ రెడ్డి కావాలని.. బీఆర్ఎస్ చేసిన పనులను ప్రజలకు వివరించాలని చెప్పారు. చేతకాని మాటలు చెప్పే దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులని.. ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారని విమర్శించారు. రాష్టంలో మంచి నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ దద్దమ్మ లకు ఎందుకు ఓటు వేయాలో ఆడగండని అన్నారు.కాంగ్రెస్ నేత డీకే శివ కుమార్ చెప్పినట్లు కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో 5 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. 5 గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్.. కడుపు నిండా కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ ఓటు వేయాలని చెప్పారు.
ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి పని కాలేదని.. ఉపఎన్నికల్లో దుబ్బాక ప్రజలు మోసపోయారని అన్నారు. తెలంగాణలో ఈ సారి బీజేపీ.. ఒక్క సీటు లేదా డకౌట్ అయితదని.. అలాంటి బీజేపీతో తెలంగాణలో ఏం పని అయితదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఢిల్లీ నుంచి డబ్బులు వస్తున్నాయని ఆరోపించారు. దుబ్బాకలో 50 వేల మెజారిటీతో గులాబీ జెండా ఎగురావేద్దామని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పదికి పది సీటు గెలిపించి కెసిఆర్ గిఫ్ట్ ఇస్తానని.. మెదక్ జిల్లా గులాబీ ఆడ్డా అని నిరూపిస్తానని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.