మట్టి ఇళ్లతో పర్యావరణానికి మేలు : కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్

మట్టి ఇళ్లతో పర్యావరణానికి మేలు :  కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్
  • రమ్మిడి ఎర్త్ ఫౌండేషన్, సీఎస్​ఈబీ పద్ధతులపై ట్రైనింగ్​ 
  • కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్ ​వినూత్న ప్రోగ్రామ్​

భద్రాచలం, వెలుగు :  పర్యావరణానికి పెద్ద పీట వేస్తూ సంప్రదాయాలను కాపాడుకునేందుకు మట్టికట్టడాలు చేపట్టాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​జితేశ్ ​వి పాటిల్, ఐటీడీఏ పీవో బి.రాహుల్​అన్నారు. రమ్మిడి ఎర్త్ ఫౌండేషన్, సీఎస్​ఈబీ పద్ధతుల్లో మట్టికట్టడాలపై మంగళవారం భద్రాచలం ఐటీడీఏలోని వైటీసీ(యూత్​ ట్రైనింగ్​ సెంటర్​)లో రెండు రోజుల ట్రైనింగ్​ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలనుకనుగుణంగా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. 

పర్యావరణానికి పని లేకుండా మట్టి ఇండ్లు కట్టుకోవచ్చని, ఖర్చుకూడా తక్కువ అవుతుందన్నారు. మట్టితో తయారు చేసిన ఇండ్లు, టాయిలెట్లు, బాత్రూమ్​లు, అంగన్​వాడీ సెంటర్లు నిర్మించుకోవచ్చన్నారు. ప్రతీ గ్రామంలో చెరువులు, వాగుల్లో రకరకాల రాళ్లు లభ్యమౌతాయని, పంట పొలాల్లోనే కావాల్సినంత మట్టి దొరుకుతుందని చెప్పారు. వెదురు కర్రలతో కావాల్సిన రీతిలో అందమైన ఇంటి నిర్మాణాలు తక్కువ సమయంలో పూర్తి చేసుకోవచ్చన్నారు.  తక్కువ పెట్టుబడితో పాఠశాలల్లోని ప్రహరీ, కిచెన్​ షెడ్లు, డైనింగ్​ హాల్స్, అంగన్​వాడీ సెంటర్లు, జీపీఎస్​ పాఠశాలల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. 

ట్రైనింగ్​లో కలెక్టర్, పీవో

ట్రైనింగ్​లో స్వయంగా కలెక్టర్, పీవో పాల్గొని ఇటుకలను తయారు చేయడం నేర్చుకున్నారు. ట్రైనింగ్​కు వచ్చిన ఆఫీసర్లు, తాపీ మేస్త్రీలు, ఆదివాసీల్లో ఉత్సాహం నింపారు. వారితో కూడా ఇటుకలు తయారు చేయించారు. రమ్మడి ఎర్త్ ఫౌండేషన్​లో మట్టిని పొరలుగా వేసి నిర్మించే పునాది, గోడలు, ఫౌండేషన్లు ఎలా కట్టాలన్నది పరిశీలించారు. బట్టీల్లో కాల్చకుండా తయారు చేసే మట్టి ఇటుకలను సీఎస్​ఈబీ విధానం తెలుసుకున్నారు. 

చేతులతో ఉపయోగించే చిన్న మిషనరీతో ఇటుకలను తయారు చేయడాన్ని బెంగళూరు నుంచి వచ్చిన టీమ్​ సభ్యులు ప్రదర్శించారు. డీఆర్​డీఏ పీడీ విద్యాచందన, ఏపీవో జనరల్ డేవిడ్​రాజ్​, జేడీఎం హరికృష్ణ, ట్రైనీ సుధాకర్​ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు.