టూరిజం హబ్​గా కనకగిరి గుట్టలు

టూరిజం హబ్​గా కనకగిరి గుట్టలు
  • బాంబూ ప్రొడక్ట్స్ ఇంటర్ నేషనల్ స్థాయికి ఎదగాలి
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ 

చండ్రుగొండ,వెలుగు:  చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు శివారు  కనకగిరి గుట్టలు టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అనుకూలంగా ఉన్నాయని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఆదివారం బెండాలపాడు గ్రామ ఆదివాసీలు, బాంబూ క్లస్టర్ సభ్యులతో కలిసి ఆయన కనకగిరి గుట్టలపైకి ఎక్కారు. గుట్టపై వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు.

కాకతీయుల కాలంలో నిర్మించిన  ఏనుగుల మోటబావి, పసుపు బావి, పల్లేరు బావి, ఫారెస్ట్ వాచ్ టవర్, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ఏన్కూర్, జూలూరుపాడు మండలాలకు ఆనుకొని ఉన్న కనకగిరి గుట్టలను పరిశీలించారు. గుట్టల దిగువన ఉన్న హస్తాలవీరన్న, జలపాతాలు, ఫారెస్ట్ చెక్ డ్యాంలు చూశారు. అనంతరం గుట్టల సమీపంలో ఆదివాసీలు తయారు చేస్తున్న బాంబూ క్లస్టర్ ప్రొడక్ట్స్  ను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  గుట్టలపై అద్భుతమైన చూడతగిన ప్రదేశాలున్నాయన్నారు. ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్ గా మార్చేందుకు అనుకూలంగా ఉందని తెలిపారు. ఆదివాసీలు తయారు చేసిన వెదురు ఉత్పత్తులు ఇంటర్ నేషనల్ స్థాయికి ఎదగాలని సభ్యులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎంపిడీవో అశోక్, ఎస్సై స్వప్న, బాంబూ క్లస్టర్ చైర్మన్ నాగభూషణం, వైస్ చైర్మన్ మల్లం కృష్ణయ్య, సభ్యులు సురేశ్, అన్వేష్​, శ్రీను, ప్రసాద్, నర్సింహారావు, లీడర్లు భోజ్యానాయక్, ఫజల్ ఉన్నారు.