- ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, బీఆర్ఎస్ ఆఫీసుల ఓపెనింగ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో సీఎం కేసీఆర్ గురువారం పర్యటించనున్నారు. పాల్వంచలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడనున్నారు. కొత్తగూడెంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ను ప్రారంభిస్తారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావ్ బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.
56 శాఖలకు రూమ్స్ కేటాయింపు..
కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల కోసం మూడు చాంబర్లను నిర్మించారు. విజిటర్స్ వెయిటింగ్ రూమ్, మీటింగ్ హాల్స్‌ను నిర్మించారు. జీ ప్లస్2 పద్ధతిలో నిర్మించిన కలెక్టరేట్లో లిఫ్ట్ ఏర్పాటు చేశారు. 56 శాఖలకు గదులను కేటాయించారు. గురువారం ఉదయం 9 గంటలకు అన్ని శాఖల అధికారులు కలెక్టరేట్‌కు చేరుకోవాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు.
ముస్తాబైన బీఆర్ఎస్ బిల్డింగ్..
కొత్తగూడెంలో నిర్మించిన బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఏర్పాట్లను ప్రభుత్వ విప్, పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పర్యవేక్షించారు. ఆఫీస్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత పార్టీ ఆఫీసును సీఎం ప్రారంభిస్తారని రేగా తెలిపారు.
భారీ బందోబస్తు
సీఎం పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. పాల్వంచలో పోలీస్ అధికారులతో బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. 2 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు పెడుతున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు.
సీఎం టూర్ షెడ్యూల్..
- 1:30 ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కు చేరుకుంటారు.
- 1:40 ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు.
- 2:15 కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడతారు.
- 3:15 పాల్వంచ నుంచి కొత్తగూడెంలోని బీఆర్ఎస్ భవన్‌కు బయలుదేరుతారు.
- 3:30 బీఆర్ఎస్ భవన్‌ను ప్రారంభిస్తారు. పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడతారు.
- 4:00 కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం.