వారంలోపు పరిస్థితులు మారాలి.. లేకపోతే మీరు మారుతారు : కలెక్టర్ జితేశ్​ వి పాటిల్

వారంలోపు పరిస్థితులు మారాలి.. లేకపోతే మీరు మారుతారు : కలెక్టర్ జితేశ్​ వి పాటిల్
  • రామవరం ఎంసీహెచ్ అధికారులకు కలెక్టర్ హెచ్చరిక 

చుంచుపల్లి, వెలుగు : ‘జిల్లా కేంద్రంలోని రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వారంలోపు పరిస్థితులు మారాలి.. లేకపోతే మీరు మారుతారు’ అని అధికారులను భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​ వి పాటిల్ హెచ్చరించారు. శుక్రవారం హాస్పిటల్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎక్స్ రే మెషీన్ ,హెల్ప్ లైన్ నెంబర్ పనిచేయకపోవడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో మందులు ఉండగా బయట మెడిసిన్​కు ఎందుకు పంపుతున్నారని ప్రశ్నించారు.

టీ హబ్ కు టెస్ట్ శాంపిల్స్ ను పంపకుండా పేషెంట్లను బయట టెస్ట్ లకు పంపుతున్నారని ఫిర్యాదు అందినట్లు ఆయన తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రాధామోహన్ హైదరాబాద్ లో ఉంటున్నట్లు తెలియడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతులు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎం హెచ్ వో భాస్కర్ నాయక్, డీసీహెచ్ఎస్  రవిబాబు తదితరులు 
పాల్గొన్నారు.

జన్యు పరమైన లోపాలను అధిగమించవచ్చు

రామవరం ఎమ్ సీ హెచ్ లో సింగిల్ జీన్ డిజార్డర్స్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. గర్భిణులు, నవజాత శిశువులలో జన్యు, జీవక్రియ రుగ్మతలను ముందస్తుగా గుర్తించడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. 

భద్రాచలం ఏరియా ఆస్పత్రి డాక్టర్లకు అభినందన

భద్రాచలం :  కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తల్లీబిడ్డలకు భద్రాచలం ఏరియా ఆస్పత్రి డాక్టర్లు వైద్యం అందించి రక్షించారు. చర్ల మండలం రాళ్లాపురం గ్రామానికి చెందిన కుంజం ముయ్యమ్మ అనే 39 ఏళ్ల ఆదివాసీ మహిళ ప్రసవం కోసం ఈనెల 11న భద్రాచలం ఏరియా ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు 9 సార్లు మూర్చ రావడం, బీపీ పెరగడంతో అపస్మారక స్థితికి చేరింది.

డాక్టర్లు కష్టపడి ఆమెకు ఆపరేషన్​ చేసి డెలివరీ చేశారు. ఐసీయూలో ఉంచి తల్లీబిడ్లను బతికించడంతో డాక్టర్లను కలెక్టర్​అభినందించారు.