భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నెలకొన్న సమస్యలతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. వంద పడకల నుంచి 330 పడకల హాస్పిటల్‌గా మారడంతో పాటు మెడికల్ కాలేజ్ పరిధిలోకి వెళ్లడంతో హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందుతుందని జిల్లా ప్రజలు భావించారు. హాస్పిటల్ స్థాయి పెరగడం, స్పెషలిస్ట్ డాక్టర్లు రావడం వరకు బాగానే ఉన్నా మందులు లేకపోవడంతో బయటి నుంచి కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. హాస్పిటల్లో నీటి సౌకర్యం అంతంత మాత్రంగానే ఉంది. ఎక్స్‌రే ల్యాబ్‌లో సిబ్బంది కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు. బ్లడ్ బ్యాంక్‌లో రక్తం నిల్వలు అందుబాటులో ఉండడం లేదు.
రోగులకు తప్పని తిప్పలు..
గతంలో ఓపీ 350 నుంచి 500 వరకు ఉంటే ప్రస్తుతం 500 నుంచి 800కు పెరిగింది. ఇందుకు తగ్గట్టుగా మందుల బడ్జెట్ పెరగకపోవడంతో అరకొర మందులతోనే నెట్టుకొస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లలేని వాళ్లు గవర్నమెంట్ హాస్పిటల్‌కు వస్తుండగా, కొన్ని మందులు లేవని, బయటి నుంచి కొనుక్కోవాలని సిబ్బంది సూచిస్తుంటే రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని కొందరు డాక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే అందుబాటులో ఉన్న మందులనే రాయాలని సూచిస్తున్నారు. మరో వైపు హాస్పిటల్లో నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతున్నాయి. తాగేందుకు కూడా నీళ్ల దొరకడం లేదని పేషెంట్లు, వారి బంధువులు వాపోతున్నారు. పై అంతస్థులో ఉన్న వారు మంచినీటి కోసం కిందికి రావాల్సిన పరిస్థితి ఉంది. ఎక్స్ రే ల్యాబ్‌లో రేడియో గ్రాఫర్, డార్క్ రూం అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. రోజుకు 60 నుంచి 80 వరకు ఎక్స్‌రేలు తీయాల్సి వస్తుండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్లు సమయానికి రాకపోవడంతో పడిగాపులు పడాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారు. డాక్టర్ సెలవు పెట్టినా ఆ విషయం చెప్పే వారు లేక రోగులు గంటల కొద్దీ వేచి చూసి వెనుదిరుగుతున్నారు.
మందులు బయట కొనుక్కున్నా..
ఎముకల డాక్టర్ దగ్గర చూపించుకుంటే ఎక్స్‌రే తీయించి మందులు రాసిచ్చారు. కొన్ని మందులే హాస్పిటల్లో ఇచ్చారు. మిగిలిన వాటిని రూ.260 పెట్టి మెడికల్ షాప్‌లో కొనుక్కున్నాను. నమ్మకంతో గవర్నమెంట్ హాస్పిటల్‌కు వస్తే సగం మందులే ఇచ్చిన్రు.
- శ్రీనివాస్, రోగి, రామవరం
సమస్యలన్నీ పరిష్కరిస్తాం..
రోగుల సంఖ్య పెరిగినా గతంలో వంద పడకల హాస్పిటల్‌కు ఇస్తున్నట్లే మెడిసిన్స్ ఇస్తున్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అవసరమైన మెడిసిన్స్ పంపిస్తున్నారు. మంచి నీటి సమస్య పరిష్కరించేందుకు మరో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు కలెక్టర్ అంగీకరించారు. రెండు మూడు నెలల్లో అన్ని సర్దుకుంటాయి.
- డాక్టర్ కుమారస్వామి, హాస్పిటల్ సూపరింటెండెంట్, కొత్తగూడెం