కొత్తగూడెం మార్కెట్​లో వ్యాపారుల ఆందోళన

కొత్తగూడెం మార్కెట్​లో వ్యాపారుల ఆందోళన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్​ అధికంగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపిస్తూ చిరు వ్యాపారులు కొత్తగూడెం మార్కెట్​లో సోమవారం ఆందోళన చేశారు. కాంట్రాక్టర్​కు వ్యాపారులకు మధ్య వాగ్వావాదం జరిగింది. కాట్రాక్టర్​ తీరును నిరసిస్తూ కొంత సేపు మార్కెట్​ను బంద్​ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గొడవను సద్దుమణిగేలా చూశారు. ఈ సందర్భంగా మార్కెట్​కమిటీ సెక్రటరీ అంజద్​తో చిరు వ్యాపారులు తమ గోడు వెల్లబోసుకున్నారు. అడిగినంత ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. 

తై బజార్ కాంట్రాక్టర్​ 15 చదరపు గజాలలోపు రూ.10 వసూలు చేయాల్సి ఉండగా రూ.30కిపైగా వసూలు చేస్తున్నారని, మిగతావాటి పరిస్థితి ఇదే విధంగా ఉందని తెలిపారు. కాంట్రాక్టర్​బలవంతపు వసూళ్లు ఆపకపోతే మార్కెట్​ను నిరవధికంగా బంద్​ చేస్తామని హెచ్చరించారు. తై బజార్​వేలం టైంలో వసూళ్లకు సంబంధించిన వివరాలను మార్కెట్​తో పాటు ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీల రూపంలో పెడతామని చెప్పిన కమిషనర్​ ఆ వివరాలను ఇప్పటికీ పెట్టకపోవడంతో గొడవలు జరుగుతున్నాయని తెలిపారు.