భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో తాగునీరు లేక గర్భిణులు, బాలింతలు, పేషెంట్ల సహాయకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్‌లోని ఆర్వో ప్లాంట్ఫిల్టర్లు మూడు రోజుల కింద చెడిపోయాయి. దీంతో తాగేందుకు నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. మేనేజ్మెంట్ వాటర్క్యాన్లు తెప్పిస్తున్నప్పటికీ చాలడం లేదని గర్భిణులు వాపోతున్నారు. తాగేందుకు నీళ్లు లేకపోవడంతో చెకప్ ల కోసం వచ్చే గర్భిణులు వెంట తెచ్చుకున్న అన్నం బాక్సులను ఓపెన్చేయకుండానే తిరిగి తీసుకెళ్తున్నారు.
గతేడాది దాదాపు రూ.18 కోట్లతో కొత్తగూడెంలోని రామవరంలో మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రారంభ సమయంలో అధునాతన సౌకర్యాలు కల్పించామని మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్కుమార్చెప్పగా.. ప్రస్తుతం గుక్కెడు నీటి కోసం హాస్పిటల్బయటికి పరుగులు తీయాల్సి వస్తోందని గర్భిణుల బంధువులు వాపోతున్నారు. నవభారత్ ఇండస్ట్రీ వాళ్లు ఇక్కడ ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేసినప్పటికీ, దాన్ని పర్యవేక్షించేందుకు సిబ్బంది లేకపోవడంతో తరచూ పాడవుతోందని తెలుస్తోంది.
కేంద్రానికి వచ్చే గర్భిణిలు, బాలింతలు అన్నం బాక్సులతోపాటు వాటర్ బాటిళ్లు వెంట తెచ్చుకోవాల్సి వస్తోంది. డెలివరీ అయిన మహిళల కుటుంబ సభ్యులు బయట నుంచి వాటర్‌బాటిళ్లు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి కనీసం లోపల ఉన్న సిబ్బంది కూడా తాగేందుకు నీళ్లు ఉండడం లేదని కొందరు చెబుతున్నారు.