కొత్త పీఆర్సీ వెంటనే ప్రకటించాలి : గుండు లక్ష్మణ్​

కొత్త పీఆర్సీ వెంటనే ప్రకటించాలి : గుండు లక్ష్మణ్​
  • పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెండింగ్​లో ఉన్న ఐదు డీఏ రిలీజ్​ చేయడంతో పాటు కొత్త పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించాలని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్​ డిమాండ్​ చేశారు. ఈ విషయమై ఆదివారం కొత్తగూడెంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హత కలిగిన టీచర్స్​కు ఎంఈవో, డిప్యూటీ ఈవోలుగా ప్రమోషన్లు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

రెండేండ్లుగా డీఏలు మంజూరు చేయకపోవడంతో టీచర్స్​ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రిటైర్డ్​ టీచర్స్​కు రావాల్సిన బెనిఫిట్స్​ను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. ఏజెన్సీ చట్టాలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ ధరకే ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్​ చేశారు. ఓపీఎస్​ పెన్షన్​ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డీ. వెంకటేశ్వరరావు, బీ.రవి, యూనియన్​నేతలు పాల్గొన్నారు. 

టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే 

టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హామీ ఇచ్చారు. చుంచుపల్లి మండలంలోని విద్యానగర్​ కాలనీలోని  ఓ ప్రయివేట్​ ఫంక్షన్​ హాల్​లో జరిగిన పీఆర్టీయూ నాలుగో జిల్లా కౌన్సిల్​ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీచర్ల సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూ చేస్తున్న పోరాటాలను ఎమ్మెల్యే ప్రశంసించారు.