ఖమ్మంటౌన్, వెలుగు : తెలంగాణలో బీజేపీ ఎదిగేందుకు అవకాశం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. సెంటిమెంట్‌పై ఆధారపడిన బీఆర్ఎస్ అధికారంలో లేకుండా బతకలేదని, కాంగ్రెస్, ఇతర రాజకీయ పక్షాలకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు సీపీఐకే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఖమ్మంలో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశ నిర్ణయాలను ఆయన ఆదివారం మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో సీపీఐ రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తోందన్నారు.
పొత్తులు అనివార్యమవుతున్నాయని, అయినా ఇతరులపై ఆధారపడే అవసరం లేకుండా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కమ్యూనిస్టులు బలంగా ఉన్న చోట కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ దక్కిందని, కమ్యూనిస్టులు బలహీనంగా ఉన్నచోట బీజేపీ గెలిచిందన్నారు. కాంగ్రెస్ ఈ విషయాన్ని గుర్తించి కమ్యూనిస్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని, డీఎంకే లాగా మిత్రపక్షాలకు కూడా సరైన అవకాశాలు కల్పించాలని సూచించారు.
బొగ్గు బ్లాకుల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్‌ది ఒక్కటే వైఖరని, బీజేపీ ఎంఎండీఆర్ చట్టాన్ని తీసుకువస్తుంటే బీఆర్ఎస్ మద్దతునిచ్చిందని సాంబశివరావు ఆరోపించారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకుంటామని, రాష్ట్ర వ్యాప్తంగా జులై 5 నుంచి ఆందోళన చేస్తామని ప్రకటించారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు హేమంతరావు, పర్ష పద్మ పాల్గొన్నారు.