- కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
హుజూరాబాద్, వెలుగు : బీఆర్ఎస్‌కు రాష్ట్రంలో మనుగడ లేదని, ఆ పార్టీ లీడర్ల మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని సీపీఐ నేత, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. దేశంలో మతాల పేరిట రాజకీయం చేసే బీజేపీ ఆటలు సాగనివ్వమన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో సీపీఐని ధృతరాష్ట్రుని కౌగిలిలో ఉందని అనడం హాస్యాస్పదమన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో భాగంగా రైతు రుణమాఫీ కొంతమేర చేశారని, మరి కొంతమందికి చేయాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఆ పార్టీపై ఒత్తిడి తెస్తామని, కాంగ్రెస్ కు సలహాలు, సూచనలు చేస్తామన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ భూముల సర్వే చేయకుండా ఏ చట్టం తీసుకువచ్చినా అది పూర్తి స్థాయిలో సక్సెస్కాదన్నారు.
రాష్ట్రంలో చాలా బిల్లులు పెండింగులో ఉన్నాయని, వాటిని విడుదల చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, గోవిందుల రవి, ఏఐఎస్ఎఫ్ లీడర్లు రామారాపు వెంకటేశ్ పాల్గొన్నారు.