భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జాబ్ మేళాలతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్లో సోమవారం నిర్వహించిన జాబ్ మేళాను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగుల కోసం చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఆఫీసర్లు కృషి చేయాలన్నారు.
జాబ్‌మేళాకు దాదాపు 2,450 నిరుద్యోగులు అటెండ్ కాగా, దాదాపు 1,531 మంది జాబ్ ఆఫర్ లెటర్లను ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రోగ్రాంలో జిల్లా క్రీడల, యువజన శాఖ ఇన్చార్జి అధికారి సంజీవరావు, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ వేల్పుల విజేత, మున్సిపల్ చైర్ పర్సన్ కె. సీతాలక్ష్మి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తుక్కు తరలింపుపై విచారణ చేపట్టాలి
పాల్వంచ : పాల్వంచలో మూసి వేసిన కేటీపీఎస్ పాత ప్లాంటు తుక్కు టెండర్ల పై సమగ్ర విచారణ చేపట్టాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ జితేశ్వి పాటిల్ తో కలిసి కర్మాగారంలో టెండర్లు ప్రక్రియకు సంబంధించిన రికార్డులను సోమవారం కేటీపీఎస్ ఎస్ఈ కార్యాలయంలో పరిశీలించారు. కొత్త కలెక్టర్ బాధ్యతలు చేపట్టాక పాత తేదీ పై గత కలెక్టర్ కూలింగ్ టవర్ల కూల్చివేత అనుమతులు ఇవ్వడాన్ని ఎమ్మెల్యే తప్పుబట్టారు.
కేటీపీ ఎస్ లో సుమారు రూ.2 వేల కోట్ల స్క్రాప్ ఉండగా కేవలం 430 కోట్ల కు మా త్రమే ఎస్టిమేషన్ వేసి ప్రజాధనాన్ని దొడ్డి దారిన తరలించారని ఆరోపించారు. కలెక్టర్ మాట్లాడుతూ టెండర్లకు సంబంధించిన అన్ని విషయాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, సంబంధిత సంస్థ నుంచి నివేదిక కోరుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వివేక్, మున్సిపల్ కమిషనర్ అజ్మీర స్వామి, కేటీపీఎస్ 5,6 దశల చీఫ్ ఇంజినీర్ మేక ప్రభాకర్ రావు, ఎస్ఈ కిరణ్ కుమార్, డీఈలు పాల్గొన్నారు.