కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆయన ఎన్నిక చెల్లదని.. ఎమ్మెల్యేగా కొనసాగించకూడదని స్పష్టం చేస్తూ తీర్పు చెప్పింది హైకోర్టు. అదే విధంగా ప్రధాన ప్రత్యర్థి.. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావ్ ను ఎమ్మెల్యేగా కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఎమ్మెల్యే వనమాపై కేసు ఏంటీ.. హైకోర్టులో జలగం వెంకట్రావ్ కేసు వేశారు అనేది తెలుసుకుందాం..
2018 ఎన్నికల నామిషనేషన్ సమయంలో.. వనమా వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. అందులో తన, తన భార్య ఆస్తులకు సంబంధించిన ఫాం 26 అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఆస్తుల వివరాలు వెల్లడించలేదు. తన వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాలు ఇవ్వకపోగా.. తన ఇల్లు, తన భార్య పేరున ఉన్న వ్యవసాయ భూమికి సంబంధించిన ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్ కు ఇవ్వలేదు వనమా వెంకటేశ్వరరావు.
ఎన్నికల నిబంధనల ప్రకారం పోటీ చేసే అభ్యర్థి తన పేరుతో పాటు తన భార్య పేరుతో ఉన్న ఆస్తుల వివరాలు అన్నింటినీ ఫాం 26 కింద అఫిడవిట్ దాఖలు చేయలేదు. తన ఆస్తులను నామిషనేషన్ సమయంలో చూపించలేదు వనమా వెంకటేశ్వరరావు. ఇదే విషయాన్ని ఓడిపోయిన జలగం వెంకట్రావు.. 2019లో హైకోర్టులో ఎలక్షన్ పిటీషన్ దాఖలు చేశారు.
నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత.. వనమా వెంకటేశ్వరరావు తన ఆస్తులను చూపించలేదని.. ప్రకటించలేదని నిర్థారిస్తూ.. అతని ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేసింది. ఆయన స్థానంలో జలగం వెంకట్రావును కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. తీర్పుపై అప్పీల్ చేయటానికి.. సుప్రీంకోర్టుకు వెళ్లటానికి 30 రోజుల సమయం ఇచ్చింది తెలంగాణ హైకోర్టు.