భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం మున్సిపాలిటీలో పర్మిషన్లను పక్కన పెట్టి పై అంతస్తులు నిర్మిస్తున్నా మున్సిపల్, టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. నోటీసులు ఇస్తున్నాం.. టాస్క్ ఫోర్స్ టీమ్ చర్యలు తీసుకోవాలి..ఇంతకన్నా మేమేం చేయాలంటూ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు చేతులు దులుపుకుంటున్నారు. చర్యలు తీసుకోవాల్సిన టాస్క్‌ఫోర్స్ టీమ్ అక్రమ నిర్మాణాలను గుర్తించడంతోనే తమ పని అయిపోయినట్లుగా భావిస్తోంది.
ఆఫీసర్ల నిర్లక్ష్యం..
బహుళ అంతస్థుల నిర్మాణాల విషయంలో మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జీ ప్లస్–2, జీ ప్లస్–3 నిర్మాణాలకు అనుమతులు తీసుకుంటున్న ఓనర్లు, జీ ప్లస్– 4, 5 గా నిర్మిస్తున్నారు. కొత్తగూడెం పట్టణంలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ రోడ్‌తో పాటు గణేశ్ టెంపుల్ ఏరియా, బూడిదగడ్డ, మేదరబస్తీ, సూర్యోదయ స్కూల్ నుంచి పాత కొత్తగూడెం వెళ్లే దారి, బస్టాండ్ ఏరియా, హనుమాన్ బస్తీ తదితర ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు సాగుతున్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో 200 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు బల్దియా ఆఫీసర్లు గతంలో గుర్తించారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా చేపడుతున్న 23 బిల్డింగ్‌లను టాస్క్‌ఫోర్స్ టీమ్గుర్తించింది. పట్టణంలోని గణేశ్‌టెంపుల్ ఏరియాలోని మెయిన్ రోడ్డు పక్కనే నిర్మిస్తున్న బిల్డింగ్ మున్సిపల్ ఆఫీసుకు కూత వేటు దూరంలోనే ఉన్నా సంబంధిత ఆఫీసర్లు పట్టించుకోక పోవడం గమనార్హం. అక్రమ నిర్మాణమని ఆ బిల్డింగ్‌లకు ఫ్లెక్సీలను పెట్టి ఊరుకున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల ఒత్తిడి, అధికారులతో ఓనర్లు లాలూచీ పడడంతో కొద్ది రోజుల తర్వాత ఈ నిర్మాణాలన్నీ సక్రమమయ్యాయి. టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు ఆపిన భవనాల పనులు అనుమతులు లేకుండానే పూర్తయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పలు ప్రాంతాల్లో రూల్స్ పక్కన పెట్టి అపార్ట్మెంట్లు కడుతున్నా ఆఫీసర్లు తమ దృష్టికి రాలేదని దాట వేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై నిలదీస్తే నోటీసులు ఇస్తామని చెబుతున్నారు.
టాస్క్ ఫోర్స్ టీమ్ చర్యలు తీసుకోవాలి
పట్టణంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను గత ఏడాది టాస్క్ ఫోర్స్ టీమ్ గుర్తించింది. టాస్క్ ఫోర్స్ కమిటీ ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఆ బిల్డింగ్లు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. ఇలాంటి నిర్మాణాలను ఆపాల్సింది టాస్క్ ఫోర్స్ బృందమే.- ప్రభాకర్, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్
అక్రమ నిర్మాణాలను కూల్చేస్తాం
పట్టణంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్లే దారిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను ఆదేశించా. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఊరుకునేది లేదు. పర్మిషన్ తీసుకున్న తర్వాతే నిర్మాణాలు చేపట్టాలి. - రఘు, మున్సిపల్ కమిషనర్