మున్సిపల్​ నిధులు పక్కదారి

  • పాలకులు, ఆఫీసర్ల ఇష్టారాజ్యం
  • కలెక్టర్​పేరు చెప్పి నిధుల మళ్లింపు
  • పట్టణ సమస్యలు గాలికి..
  • తమకు నిధులేవని ప్రశ్నిస్తున్న కౌన్సిలర్లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:  కొత్తగూడెం మున్సిపాలిటీ నిధులు పక్కదారి పడుతున్నాయి. పట్టణ పరిధిలోని సమస్యలపై ఖర్చు చేయాల్సిన ఆఫీసర్లు, పాలకులు ఇతర శాఖలకు కేటాయిస్తున్నారు. కలెక్టర్ చెప్పారంటూ నిధులను మళ్లిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని సంబంధిత వార్డుల కౌన్సిలర్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే రూ.కోట్ల నిధులు దారి మళ్లించారని, ఇప్పుడు ప్రజాప్రతినిధుల కోసం మరిన్ని నిధులు కేటాయించడాన్ని పబ్లిక్​తప్పుపడుతున్నారు.

 తాము కౌన్సిల్​సమావేశాల్లో వార్డుల అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని అడిగితే ఎందుకు ఇవ్వడంలేదని కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొత్తగూడెం మున్సిపాలిటీకి చెందిన నిధులను ఏమాత్రం సంబంధం లేని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఆధునీకరణ, హెల్త్​ డిపార్ట్​మెంట్, పంచాయతీరాజ్​శాఖలకు రూ.కోట్లలో కేటాయించారు. అయితే ఇదే విషయంపై ప్రతిపక్ష, ఇండిపెండెంట్​ కౌన్సిలర్లు పెద్ద దుమారమే తీసుకువస్తున్నారు.

ఎమ్మెల్యే కాంప్ ఆఫీస్ మొదలుకొని..

కొత్తగూడెం మున్సిపాలిటీకి సంబంధించిన ఫండ్స్​ను సొంత సమస్యల పరిష్కారం, అభివృద్ధికి వాడకుండా సంబంధం లేని ఇతర శాఖలకు పాలకులు, ఆఫీసర్లు కేటాయిస్తున్నారు. సాధారణంగా మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే తనకొచ్చే ఫండ్స్​నుంచి కొంతమేర ఇస్తుంటారు. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు రూ.5లక్షలను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​లో అభివృద్ధి పనులకు కేటాయిస్తూ కౌన్సిల్ తీర్మానం చేసింది. ఇవి సరిపోవడంలేదంటూ మరో రూ.25లక్షలకు పైగా కేటాయించేందుకు రెడీ అవుతున్నట్లు పలువురు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.

 లక్ష్మీదేవిపల్లి మండలంలోని ముర్రెడు వాడు బ్రిడ్జిపై లైటింగ్, ఇతరత్రా పనుల కోసం దాదాపు రూ.2.50లక్షల మేర కేటాయించారు. ఇదే క్రమంలో పట్టణంలోని రామవరంలో గల మాతాశిశు సంరక్షణ కేంద్రంలోని పార్క్, ఇతరత్రా అభివృద్ధి పనులకు దాదాపు రూ.55 లక్షలు కేటాయించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మాతాశిశు సంరక్షణ కేంద్రంలో హెల్త్​డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న న్యూట్రీషియన్​కిట్ల పంపిణీకి రూ.1.80లక్షలను కేటాయించారు. ఇవే కాకుండా ఆర్టీసీ బస్టాండ్ ను ఆధునీకరించేందుకు దాదాపు రూ. 80లక్షలను మున్సిపాలిటీ ఫండ్స్​నుంచే కేటాయించారు.

ఇక్కడి సమస్యల సంగతేంటి?

కొత్తగూడెం మున్సిపాలిటీ ఆఫీసర్లు, పాలకులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. పట్టణంలోని పలు సమస్యలతోపాటు అభివృద్ధిని వారు గాలికొదిలేశానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా తయారయ్యాయి. ప్రతి రోజు పట్టణవాసులకు నీటి సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. పైపు లైన్ల లీకేజీలను కూడా పట్టించుకోవడంలేదు. ఇవే కాకుండా పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన పాలకులు, ఆఫీసర్లు ఏ సమస్యా లేనట్టు వ్యవహరిస్తున్నారు. కాగా తమ వార్డులకు నిధులు కేటాయించాలని పలుమార్లు కౌన్సిల్ మీటింగ్​లో చర్చించినా పట్టించుకోవడం లేదని, ఇతర శాఖలకు ఫండ్స్ ఎలా కేటాయిస్తున్నారంటూ కౌన్సిలర్లు ప్రశ్నిస్తే కలెక్టర్​చెప్పారంటూ చైర్ పర్సన్, ఆఫీసర్లు సమాధానమివ్వడం కామన్​గా మారింది. దీనిపై అధికార బీఆర్ఎస్ తోపాటు, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.11వ వార్డులో శ్మశాన వాటికకు వెళ్లే రోడ్డు, అక్కడ ఏర్పాట్లు, 24వ వార్డులోని శ్మశాన వాటిక డెవలప్ మెంట్, ఎలక్ట్రికల్, గ్యాస్​దహన వాటికల ఏర్పాటుకు ఫండ్స్ కావాలని అడుగుతున్నా అధికారుల్లో ఉలుకూ పలుకు లేదని ఆయా వార్డుల కౌన్సిలర్లు వాపోయారు.

అడిగితే కేటాయిస్తలె..

వార్డుల్లోని పనులకు డబ్బులు ఇయ్యమని అడిగితే ఫండ్స్​లేవంటున్నరు. ఆర్టీసీ, హెల్త్​డిపార్ట్​మెంట్, పంచాయతీలకు పైసలు ఎట్లా పంపిండ్రో అర్థం అయిత లేదు. మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారానికే ఫండ్స్​లేవు. వేరే శాఖలకు ఎలా కేటాయిస్తున్నారో వారికే తెలియాలె. 

–మునిగడప పద్మ, కౌన్సిలర్

నిధుల మళ్లింపు దారుణం..

మున్సిపాలిటీలో రోడ్లు మంచిగ లేవు. వార్డుల్లో సరైన డ్రైనేజీలు లేవు. ప్రతి రోజు జనాలకు మంచినీళ్లు ఇస్తలేరు. ఇవేకాకుండా పట్టణంలో సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. వీటిపై అధికారులు, పాలకులను ప్రశ్నిస్తే నిధులు లేవంటున్నరు. కానీ వేరే శాఖలకు రూ.కోట్లలో ఫండ్స్​ఎలా కేటాయిస్తున్నరు. ఇది చాలా దారుణం.

 - వై. శ్రీనివాస్​రెడ్డి, సీపీఐ మున్సిపల్ ఫ్లోర్​ లీడర్, కొత్తగూడెం