జంటగా కొత్తగూడెం..పాల్వంచ అభివృద్ధి : పువ్వాడ అజయ్​ కుమార్​

  •    మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ 
  •     రూ. 135కోట్ల డెవలప్​మెంట్​ వర్క్స్​కు శంకుస్థాపన 
  •     అధికార వేదికపై ఫ్లెక్సీలో కానరాని ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్​ ఫోటోలు
  •     కుర్చీలు వేసిన పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు జంట పట్టణాలుగా డెవలప్​ అవుతున్నాయని ట్రాన్స్​పోర్టు మినిస్టర్​ పువ్వాడ అజయ్​కుమార్​ అన్నారు.  కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో దాదాపు రూ. 135 కోట్లతో చేపట్టనున్న డెవలప్​మెంట్​ వర్క్స్​కు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని రామవరంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు.  

ముర్రెడు వాగుకు ఇరువైపులా కరకట్టల నిర్మాణాలకు  సీఎం రూ. 40 కోట్లు మంజూరు చేశారన్నారు. అభివృద్ధి జరగాలంటే వనమానే మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలన్నారు.  కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల,  మున్సిపల్​ చైర్​ పర్సన్​ కె. సీతాలక్ష్మి, జడ్పీ వైస్​ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్​, జిల్లా గ్రంథాయల సంస్థ చైర్మన్​ దిండిగాల రాజేందర్​, మున్సిపల్​ వైస్​ చైర్మన్​దామోదర్​, పలువురు కౌన్సిలర్లు, అధికారులు, బీఆర్​ఎస్​ నేతలు పాల్గొన్నారు.

ప్రోటోకాల్ రగడ

ఈ వేదిక పై  ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో పాటు జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య ఫోటోలు ఏర్పాటు చేయకపోవడం తో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  జడ్పీ వైస్​ చైర్మన్​, డీసీఎంఎస్​ల ఫోటోలు ఏర్పాటు చేసిన అధికారులు ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్​ ఫోటోలు ఏర్పాటు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ప్రోటోకాల్​ పాటించని మున్సిపల్​ కమిషనర్​పై కలెక్టర్​ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో శాసన మండలి చైర్మన్​కు కంప్లైంట్​ చేస్తానని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పేర్కొన్నారు. ఈ సభలో పోలీసులే కుర్చీలు వేయడం గమనార్హం.