భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్లో జిల్లా అధికారులు, సిబ్బంది ప్రతిభ చూపి జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో మారుమోగించాలని ఎస్పీ బి. రోహిత్ రాజు అన్నారు. పోలీస్ డ్యూటీ మీట్లో భాగంగా ఈనెల 3,4న జోనల్ స్థాయి పోటీలు వరంగల్‌లో జరిగాయి. జోనల్ స్థాయిలో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులు, సిబ్బందిని కొత్తగూడెం ఎస్పీ ఆఫీస్‌లో గురువారం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో ఎస్పీ అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల నుంచి పలు విభాగాల్లో జరిగిన పోటీల్లో జిల్లాకు 22 పతకాలు రావడం అభినందనీయమన్నారు. జోనల్ స్థాయి పోటీల్లో ఏడు గోల్డ్ మెడల్స్, ఏడు సిల్వర్, 8 బ్రాంజ్ మెడల్స్ జిల్లాకు వచ్చాయన్నారు. పోలీస్ శాఖలో నిర్వహించే విధుల పట్ల తమ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు ప్రతిభను చూపేందుకు ప్రతి ఏటా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నామన్నారు.
ఈ పోటీలకు నోడల్ ఆఫీసర్స్‌గా వ్యవహరించిన డీఎస్పీ మల్లయ్య స్వామి, కో ఆర్డినేటర్స్ ఇన్స్పెక్టర్లు అశోక్ కుమార్, నాగరాజు రెడ్డి, అశోక్ రెడ్డిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.