- కొత్తగూడెం ఆర్టీసీ కార్మికుల ఆవేదన
- అనారోగ్యం పాలవుతున్నామని ఆందోళన
- రాత్రి 8 దాటినా మహిళా ఉద్యోగులకు డ్యూటీ తప్పట్లే
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం ఆర్టీసీ డిపోలో కార్మికులు డబుల్ డ్యూటీలతో తిప్పలు పడ్తున్నారు. ఉన్నతాధికారుల మెప్పు కోసం ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా పని గంటలు పెంచుతున్నారని వాపోతున్నారు. మహిళా ఉద్యోగులు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నష్టాల నుంచి గట్టెక్కాలంటే ఇబ్బందులు తప్పవంటూ అధికారులు చెబుతున్ననప్పటికీ తమ ఆరోగ్యం దెబ్బ తింటుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని భారంపై ఆర్టీసీలోని యూనియన్లు జేఏసీగా ఏర్పడి ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నాయి.
అప్పుడు ఎక్సెస్ అని పంపించిన్రు..
కొత్తగూడెం డిపోలో 72 బస్సులు ఉండగా, 86 మంది డ్రైవర్లు, 140 మంది కండక్టర్లు పని చేస్తున్నారు. 3 నెలల కింద సర్వీసులు తగ్గించిన అధికారులు కార్మికులు ఎక్సెస్‌గా ఉన్నారని చూపించారు. 45 మందిని ఆదిలాబాద్, భద్రాచలం, మంచిర్యాల, గోదావరిఖని తదితర డిపోలకు ట్రాన్స్ ఫర్ చేశారు. ఇప్పుడు సర్వీసులు పెంచిన ఆఫీసర్లు ఉన్న కార్మికులతోనే పని చేయిస్తున్నారు. గతంలో 12 నుంచి 14 గంటలు పని చేసిన కార్మికులు ఇప్పుడు 18 నుంచి 23 గంటల వరకు పని చేయాల్సి వస్తుందని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. నైట్ ఔట్ బస్సులు నడిపేవారు నిన్న మొన్నటి వరకు 20 గంటలు పని చేస్తే, ప్రస్తుతం 24 గంటల నుంచి 26 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఖమ్మం, భద్రాచలంతో పాటు పలు డిపోల పరిధిలో బస్సులు 480 కిలోమీటర్లు తిప్పుతుంటే కొత్తగూడెం డిపోలో మాత్రం 540 నుంచి 560 కిలోమీటర్ల మేర తిప్పుతున్నారని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. స్కూల్ బస్సులు నడిపే వారికి గతంలో నాలుగు గంటలు ఉన్న రెస్ట్, ఇప్పుడు రెండు గంటలకు కుదించారు. భద్రాచలం నుంచి విజయవాడకు టూ డేస్ ఉన్న డ్యూటీని తీసి ఒక్క రోజుకే పరిమితం చేశారు. రెండున్నర గంటల ఓటీ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకు గుండాలకు ఆర్డినరీ బస్సు 400 కిలోమీటర్లు తిరిగితే, ఇప్పుడేమో 428 కిలోమీటర్లకు పెంచారు. ఇల్లందుకు ఎక్స్‌ప్రెస్ సర్వీసులను తగ్గించడంతో ఆదాయం తగ్గిందని, ఈ సర్వీసులను నడపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. బస్సులు తగ్గించి కిలోమీటర్లు పెంచుతూ కార్మికుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని పేర్కొంటున్నారు. సరైన విశ్రాంతి లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరమైతే సెలవుల కోసం అధికారులను బతిమిలాడుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. పక్కనే ఉన్న ఖమ్మం, భద్రాచలం డిపోల కన్నా కొత్తగూడెం డిపోలో పని చేస్తున్న కార్మికులు ఎక్కువ టైం డ్యూటీ చేయాల్సి వస్తోందని అంటున్నారు.
పనిభారం తగ్గించాలని వినతి..
పని భారాన్ని తగ్గించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం డిపో మేనేజర్‌కు నాయకులు శుక్రవారం వినతిపత్రాన్ని ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లోనూ సెలవులు దొరకడం లేదని డీఎం దృష్టికి తీసుకువచ్చారు. మహిళలు 8 గంటల లోపే డ్యూటీ దిగేలా చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకులు కోరారు.
అనారోగ్యం పాలవుతున్రు..
పని భారంతో కార్మికులు అనారోగ్యం బారిన పడ్తున్నారు. పని గంటలు పెంచి కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు. గతంలో సర్వీసులు తగ్గించి ఉన్న వారిని ఇతర డిపోలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడేమో సర్వీసులు పెంచి ఉన్న వారిపై పని భారం పెంచుతున్నారు.
- కందుల భాస్కర్, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజియన్ గౌరవ అధ్యక్షుడు
డ్యూటీల్లో మార్పులు చేర్పులే..
డ్యూటీల్లో మార్పులు చేర్పులుంటాయి. పని గంటలను పెంచినట్లు కార్మికులెవరూ కంప్లైంట్ చేయలేదు. పని గంటలతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఇప్పటి వరకు ఎవరూ నా దృష్టికి తీసుకురాలేదు.
- బి వెంకటేశ్వరరావు, డీఎం, కొత్తగూడెం డిపో